ఏపీలో ఎన్నికల వేడి అప్పుడే మొదలయ్యింది. మరి కొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి అనగా.. పార్టీలు పొత్తులపై దృష్టి సారించాయి. మొన్నటి వరకు కాంగ్రెస్, టీడీపీ పొత్తు పెట్టుకుంటాయనే వార్తలు వచ్చాయి.. తాజాగా.. కాంగ్రెస్.. వైసీపీతో పొత్తు పెట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

జగన్  ఒప్పుకుంటే.. వైసీపీతో పొత్తు పెట్టుకోవడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందని చింతా మోహన్ పేర్కొన్నారు. జగన్ కి ముఖ్యమంత్రి పదవి ఇచ్చానా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన చెప్పారు. పవన్ ఒప్పుకుంటే జనసేనతో పొత్తు పెట్టుకోవడానికి కూడా తాము రెడీ గా ఉన్నట్లు చెప్పారు. ఎందుకంటే.. పవన్ తమ పార్టీ నేత చిరంజీవి తమ్ముడే కదా అని పేర్కొన్నారు.

ప్రస్తుతానికి ఇది తన వ్యక్తిగత ఆలోచనేనని.. ఈ విషయంపై తాను కేంద్ర అదిష్టానంతో చర్చిస్తానని మీడియాతో చింతా మోహన్ పేర్కొన్నారు. టీడీపీతో కలిసి పనిచేస్తే ఇబ్బందులు వస్తాయన్నారు. తెలంగాణలో టీడీపీ పొత్తవల్లే కాంగ్రెస్ దెబ్బతిన్నదని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీలో మళ్లీ అలాంటి తప్పు చేయమని స్పష్టం చేశారు. ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలు నిర్వహించాలని ఆయన ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ ని కోరారు.