విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలో ఎంతో చరిత్ర కలిగిన రామతీర్థంలోని కోదండ రామస్వామి ఆలయంలో రాముడి విగ్రహ శిరస్సును గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రంలో వరుసగా దేవాలయాలపై దాడి సంఘటనలు చోటుచేసుకోవడంతో హిందూ సంఘాలతో పాటు ప్రతిపక్ష పార్టీలు నిరసనబాట పట్టారు. ఈ క్రమంలో తాజాగా  రామతీర్థంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి పర్యటించారు. పర్యటనలో భాగంగా కోదండ రామాలయాన్నిఆయన సందర్శించారు. 

రామతీర్థం కొండపైన ఆలయంలో దుండగులు ధ్వంసం చేసిన స్వామివారి విగ్రహం, ధ్వంసమైన స్వామివారి విగ్రహం లభించిన కొలనును చినజీయర్ స్వామి పరిశీలించారు. కోదండరాముడి విగ్రహ ధ్వంసం ఘటనకు సంబంధించిన వివరాలు అక్కడి అధికారులు ఆయనకు వివరించారు.  

మరోవైపు రామతీర్థం ప్రధాన ఆలయంలో ఏమీ జరగలేదని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ చెప్పారు. బుధవారం నాడు ఉదయం ఆయన అమరావతిలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.  రామతీర్థం ఆలయం పూర్తి భద్రతలో ఉందని ఆయన చెప్పారు.

రామతీర్థం ప్రధాన ఆలయానికి రెండు కి.మీ. దూరంలో ఉన్న పాత స్ట్రక్చర్ వద్ద ఘటన చోటు చేసుకొందని ఆయన వివరించారు. రామతీర్ధం గుట్టపై సీసీ కెమెరాలు అమర్చడానికి రెండు రోజుల ముందే ఈ ఘటన చోటు చేసుకొందని డీజీపీ తెలిపారు. ప్రస్తుతం  ఆలయం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.

సెప్టెంబర్ లో అంతర్వేదిలో రథం దగ్ధం తర్వాత అల్లర్లు ప్రారంభమయ్యాయని ఆయన గుర్తు చేశారు. కావాలనే కొంతమంది వాస్తవాలను వక్రీకరిస్తున్నారని డీజీపీ చెప్పారు. పోలీసులకు కులం, మతం అంటగడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన సర్వీసులో  ఎన్నడూ ఇలాంటి మాటలు వినలేదని ఆయన చెప్పారు. 

అదే పనిగా పోలీసులపై విమర్శలు చేస్తున్నారన్నారు.ఆలయాల విషయంలో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం సాగుతోందని సవాంత్ చెప్పారు. వాస్తవాలు, పరిస్థితులు ప్రజలకు తెలియాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కోవిడ్ తో పాటు అనేక ఛాలెంజ్ లను పోలీసులు ఎదుర్కొంటున్నారని డీజీపీ తెలిపారు.కరోనాతో  109 మంది పోలీసులు మరణించారని ఆయన గుర్తు చేశారు.