అమరావతి: రాజధానిని  అమరావతిలోనే కొనసాగించాలని ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు కేసులు పెట్టారు. హత్యాయత్నంతో పాటు పలు కేసులు నమోదు చేశారు. ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు విచారణకు రావాలని  రైతులకు చిలకలూరిపేట పోలీసులు నోటీసులు జారీ చేశారు.

Also read:నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకొంటా: ఆళ్ల సంచలనం

అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సుమారు 29 గ్రామాలకు చెందిన రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. వెలగపూడి, మల్కాపురం గ్రామాలకు చెందిన రైతులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆయా గ్రామాల్లో గోడలపై పోలీసులు అంటించారు.

Also read:రాజధాని రచ్చ: 29 గ్రామాల్లో సకల జనుల సమ్మె

ఆ:దోళన చేస్తున్న వారిపై ఐపీసీ 307, 341, 324, 427 సెక్షన్ల కింద పోలీసులు కేసులు పెట్టారు. ఈ కేసులపై విచారణకు హాజరుకావాలని చిలకలూరిపేట పోలీసులు నోటీసులు అందించారు. నిరసన కార్యక్రమాలు  చేపట్టిన వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. శుక్రవారం నాడు సాయంత్రం ఐదు గంటలకు విచారణకు హాజరుకావాలని పోలీసులు ఆ నోటీసులో పేర్కొన్నారు. ఇప్పటికే రాజధానిని తరలిపోతోందనే ఆందోళనతో ఉన్న రైతులకు తాజాగా పోలీసుల కేసులు కూడ తోడయ్యాయి. దీంతో రైతులు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మండిపడుతున్నారు.

Also read:బోస్టన్ కన్సల్టెన్సీ కమిటీ నివేదిక సిద్దం: అమరావతిపై జగన్ సర్కార్ తాడోపేడో

రాజధాని తరలింపు విషయమై స్పష్టత ఇవ్వాలని రాజధాని ప్రాంత రైతులు డిమాండ్ చేస్తున్నారు.  శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమపై హాత్యాయత్నం కేసులు నమోదు చేయడంపై రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

ఇవాళ్టి నుండి రైతులు సకల జనుల సమ్మెకు దిగారు. ఈ సమ్మెలో భాగంగా స్థానికులు  పోలీసులకు పువ్వులు ఇచ్చి తమ ఉద్యమానికి సహకరించాలని కోరుతున్నారు.