దాదాపు రెండు కిలోల వెండి వస్తువులను కేవలం గంటల వ్యవధిలోని స్వాధీనం చేసుకుని బాధితుడికి అప్పగించారు. చిలకలపూడి పోలీసుల పనితీరు ఇప్పుడు అందరి ప్రశంసలు పొందుతోంది. 

మచిలీపట్నం: సామాన్యుల ఫిర్యాదుల విషయంలో అలసత్వంగా వుంటారని... వీఐపిల ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తారని పోలీసులపై అపవాదు వుంది. అయితే అందరు పోలీసులు అలాగే వుండరని... సామాన్యుడికి న్యాయం జరిగితేనే తమ వృత్తికి న్యాయం చేసామని సంతృప్తిపొందే ఖాకీలు వుంటారని కృష్ణా జిల్లా పోలీసులు నిరూపించారు. ఓ సామాన్యుడి పిర్యాదుతో కదిలిన పోలీసులు కేవలం గంటల వ్యవధిలోనే బాధితుడికి ఊరట కల్పించారు. 

వివరాల్లోకి వెళితే... కృష్ణా జిల్లా (krishna district) మచిలీపట్నం మండలం చిలకలపూడిలోని పాండురంగ స్వామి గుడి వద్ద సోమశేఖర్ అనే వ్యక్తి వెండి ఆభరణాలు, విగ్రహాల తయారుచేసి విక్రయిస్తుంటాడు. ఓ షాప్ ను అద్దెకు తీసుకుని అక్కడే వెండి వస్తువలను తయారు చేసి అక్కడే విక్రయించేవాడు. రాత్రి సమయంలో వెండి వస్తువులను ఇంటికి తీసుకువెళ్లి తిరిగి ఉదయం వాటిని తీసకువచ్చి విక్రయించేవాడు. 

Video

ఇలా ప్రతిరోజు మాదిరిగానే నిన్న (మంగళవారం) మధ్యాహ్నం షాప్ వద్ద పని ముగించుకుని దాదాపు రెండు కిలోల వెండి వస్తువులతో బైక్ పై ఇంటికి బయలుదేరాడు. అయితే మార్గమధ్యలో దాహంగా వుండటంతో ఓ షాప్ వద్ద ఆగి కూల్ డ్రింక్ తాగాడు. ఈ సమయంలో వెండి ఆభరణాల బ్యాగ్ కనిపించలేదు. దీంతో చుట్టుపక్కల వెలికినా లాభం లేకపోవడంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు. 

read more గుంటూరు: సూపర్ పోలీస్... ముగ్గరు యువకులను ప్రాణాలకు తెగించి కాపాడిన కానిస్టేబుల్ (వీడియో)

అతడి ఫిర్యాదుతో చిలకలపూడి పోలీసులు రంగంలోకి దిగి బ్యాగ్ కోసం వెతకడం ప్రారంభించారు. సోమశేఖర్ ప్రయాణించిన మార్గంలో సిసి కెమెరాలను పరిశీలించారు. ఈ క్రమంలోనే వెండి వస్తువులతో కూడిన బ్యాగ్ చిలకలపూడి మూడుగుళ్ల సెంటర్ వద్ద పడిపోయినట్లు గుర్తించారు. అక్కడికి వెళ్లి చాకచక్యంగా వ్యవహరించి సదరు వెండి ఆభరణాలు గల బ్యాగ్ ను స్వాదీనం చేసుకున్నారు. బ్యాగ్ ను పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి సోమశేఖర్ కు సమాచారం ఇచ్చారు. స్థానిక సిఐ అంకబాబు బాధితుడు సోమశేఖర్ కు సదరు బ్యాగు ను అందజేసారు. 

అతి తక్కువ సమయంలో సీసీ ఫుటేజ్ ద్వారా సుమారు లక్షా ఇరవై వేలు విలువచేసే రెండు కేజీల వెండి ఆభరణాలు పట్టుకున్న కానిస్టేబుల్ రాజేష్ కుమార్ ను బందరు టౌన్ డిఎస్పి, చిలకలపూడి సిఐ అభినందించారు. బాధితుడు సోమశేఖర్ కూడా తన సొమ్మును వెతికి తిరిగి ఇచ్చినందుకు కృష్ణా జిల్లా ఎస్పీ, బందరు డిఎస్పీ, చిలకలపూడి సీఐకి కృతజ్ఞతలు తెలిపాడు. 

ఇలా సామాన్యుడి ఫిర్యాదుపై వెంటనే స్పందించిన పోలీసులపై ప్రశంసలు కురుస్తున్నాయి. స్థానిక ప్రజలే కాదు ఈ విషయం తెలిసిన ప్రతిఒక్కరు చిలకలపూడి పోలీసులు వ్యవహరించిన తీరును ప్రశంసించకుండా వుండలేకపోతున్నారు.