పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ రూటే సపరేటు. మంత్రివర్గంలోని ఇతరులకు భిన్నంగా నడవటమే అఖిల స్టైల్. అంటే మిగిలిన వారికి ఆదర్శంగా ఉంటోందని కాదు అర్ధం. మంత్రి వ్యవహార శైలి వల్ల ఒక్కోసారి చంద్రబాబునాయుడుకు కూడా తలనొప్పులు వస్తున్నట్లు సమాచారం. ఇంతకీ విషయమేంటంటే, అవసరమైన సమయాల్లో ఇటు తన పేషీ అధికారులకే కాదు సాక్ష్యాత్తు సిఎంవో అధికారులకు కూడా అందుబాటులో ఉండటం లేదనే ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి. మంత్రివర్గ సమావేశాలకు హాజరవ్వటం కూడా అరుదట. గడచిన మూడు మంత్రివర్గ సమావేశాలకు డుమ్మా కొట్టటం మంత్రివర్గంలోనే చర్చకు దారితీసిందట.

మొన్న 10వ తేదీన ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాకు ముందు రోజు టిడిఎల్పీ సమావేశం, మంత్రివర్గ సమావేశం జరిగింది. మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలందరూ హాజరయ్యారు ఒక్క అఖిలప్రియ తప్ప. అంతకుముందే శాఖాపరమైన పని మీద ఢిల్లీ వెళ్ళిన మంత్రి ముందు రోజే హైదరాబాద్ చేరుకుని నేరుగా ఆళ్ళగడ్డకు వెళ్లిపోయారే కానీ విజయవాడ మాత్రం వెళ్ళలేదు. ఢిల్లీ నుండే విజయవాడకు బుక్ చేసిన విమాన టిక్కెట్టును సైతం క్యాన్సిల్ చేయించారట. మంత్రివర్గ సమావేశం, టిడిఎల్పీ సమావేశం ఉన్న విషయాన్ని సిబ్బంది గుర్తుచేసినా పట్టించుకోలేదట.

వ్యక్తిగత పనులకు ఇస్తున్న ప్రాధాన్యం శాఖాపరమైన వ్యవహారాలకు ఇవ్వటం లేదనే ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అందుకనే మంత్రై దాదాపు ఏడాది కావస్తున్నా ఇంత వరకూ శాఖపై పట్టు సంపాదించలేదని సిబ్బందే చెబుతున్నారు. మొన్న జరిగిన బోటు ప్రమాదంకు సంబంధించి మంత్రి మాటలనే సిబ్బంది ఉదాహరణగా చూపుతున్నారు. నదిలో తిరగటానికి ఎన్ని బోట్లకు అనుమతులున్నాయో మంత్రికి తెలీదు. ప్రమాదానికి గురైన బోటు ఎవరిదో కూడా చెప్పలేకపోయారు. ఏ శాఖ పరిధిలోకి వస్తోందో వ్యక్తిగత సిబ్బంది చెబితే కానీ మంత్రికి తీవ్రత అర్దం కాలేదట. మృతి చెందిన వారి వివరాలు మంత్రి కన్నా ముందే మీడియాకు చేరిందంటేనే పరిస్ధితిని అర్ధం చేసుకోవచ్చు.  

పనితీరు మార్చుకోమని చంద్రబాబు అఖిలను హెచ్చరించినట్లు ప్రచారం జరుగుతోంది. శాఖపై పట్టు పెంచుకోలేకపోవటానికి ప్రధాన కారణం శ్రద్ద చూపకపోవటమేనట. ఇంగ్లీషులో మంచి పట్టున్నప్పటికీ తన వద్దకు వచ్చిన ఫైళ్ళు చూడటంపై  శ్రద్ధ చూపరని సమాచారం. చంద్రబాబు ఇటీవలే వెల్లడించిన వివరాలు కూడా అదే విషయాన్ని నిర్ధారణ చేస్తున్నాయి. మంత్రుల వద్ద ఫైళ్ళు ఎన్నెన్ని రోజులు ఉంటున్నాయన్న విషయంలో సిఎం వివరాలు ఇచ్చారు. అఖిలప్రియ వద్ద ప్రతీ ఫైలు 35 రోజులు పాటు పెండింగ్ లో ఉంటోంది. అంటే, పనితీరు మెరుగుపరుచుకోమని సిఎం చెప్పినా మంత్రి పట్టించుకోవటం లేదన్న విషయం అర్ధమైపోతోంది.