అమరావతి:  తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు అచ్చెన్నాయుడి డిమాండ్ పై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి  స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పడానికి అచ్చెన్నాయుడికి షరతు పెట్టారు.

బంట్రోతు అంటే సేవకుడని అర్థమని చెవిరెడ్డి చెప్పారు. గతంలో వైఎస్‌ను నరరూప రాక్షసుడు అన్నారని గుర్తూ చేస్తూ అప్పటి వ్యాఖ్యలకు క్షమాపణ చెప్తే తానూ క్షమాపణ చెప్తానని ఆయన అన్నారు. చంద్రబాబు పుట్టిన నారావారిపల్లెకు తాను ఎమ్మెల్యేగా ఉన్నానని ఆయన అన్నారు. 

గతంలో స్పీకర్ ఎన్నికల సందర్భంగా నోట్ పంపామని టీడీపీ నేతలు చెబుతున్నారని, కోడెలను స్పీకర్‌గా ఎన్నుకోగానే జగన్ స్వయంగా చేయిపట్టుకుని సీటు వరకూ వచ్చి కూర్చోబెట్టారని ఆయన గుర్తు చేశారు. ఆ రోజున టీడీపీ కన్నా వైసీపీ నేతలు ఎక్కువ సంతోషపడ్డారని అన్నారు. కానీ ఇప్పుడు ఓ బలహీనవర్గానికి చెందిన ఎమ్మెల్యేను స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టేందుకు టీడీపీ నేతలకు మనసు రాలేదని అన్నారు. 

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలా సభాసంప్రదాయాల గురించి మాట్లాడేదని ఆయన అన్నారు. స్పీకర్ బలహీనవర్గాలకు చెందినవారు కాబట్టే ఆయన పట్టుకోవడానికి టీడీపీ నేతల మనసు ఒప్పుకోవడం లేదని అన్నారు. అదే స్థానంలో తమ సామాజికవర్గం వ్యక్తి ఉండి ఉంటే చేయి పట్టుకుని స్వయంగా తీసుకెళ్లి కూర్చోబెట్టేవారని అన్నారు. 

కానీ ఇప్పుడు స్పీకర్‌ను కుర్చీ వద్దకు తీసుకెళ్లేందుకు చంద్రబాబు తన బంట్రోతును పంపారని చెవిరెడ్డి వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలపై గురువారం శాసనసభలో దుమారం చెలరేగింది.