తిరుపతి: తన భర్త అరెస్టును నిరసిస్తూ ఆందోళనకు దిగిన వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సతీమణి లక్ష్మిని పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతో పాటు 200 మంది కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

దొంగ ఓట్ల నమోదు చేస్తున్నారంటూ ఆందోళనకు దిగిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డిని అదివారం అర్థరాత్రి 12 గంటలకు పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. చెవిరెడ్డితో సహా సుమారు 100మందిని పోలీసులు అరెస్ట్‌ చేసి, రాత్రంతా పలు ప్రాంతాల్లో తిప్పి, చివరకు తెల్లవారుజామున సత్యవీడు పోలీస్‌ స్టేషన్‌ తరలించారు. 

చెవిరెడ్డిపై ఐదు సెక్షన్ల కింద అక్రమ కేసులు నమోదు చేశారు. పోలీసుల దౌర్జన్యం, ప్రభుత్వ అరాచకానికి నిరసనగా చెవిరెడ్డి పీఎస్‌లోనే ఆందోళన కొనసాగిస్తున్నారు. 

ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి అరెస్ట్‌ను నిరసిస్తూ సోమవారం ఉదయం పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సత్యవీడు పోలీస్‌ స్టేషన్‌ వద్దకు తరలివచ్చి ఆందోళనకు దిగారు. చెవిరెడ్డిని విడుదల చేయాలంటూ ఆయన సతీమణి లక్ష్మీ దీక్షకు దిగారు. 

దీంతో పోలీసులు లక్ష్మీతో సహా మరో 200 మంది మహిళలను అరెస్ట్‌ చేశారు. మహిళలను బలవంతంగా లాక్కెల్లి దీక్ష భగ్నం చేశారు. చెవిరెడ్డి భార్య లక్ష్మీతో పాటు శోభ అనే మహిళా కార్యకర్తను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అరెస్ట్‌ సందర్భంగా జరిగిన తోపులాటలో శోభకు గాయాలయినట్లు తెలుస్తోంది. 

శోభ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. మరో నాలుగు జీపుల్లో మిగతా మహిళలను వేరు వేరు ప్రాంతాలకు తరలించారు. కాగా చెవిరెడ్డి భార్య లక్ష్మీని పీఎస్‌కు తరలించకుండా పలు ప్రాంతాలకు తిప్పినట్లు ఆరోపణలు వచ్చాయి.

తన భార్య లక్ష్మీ, ఇతర మహిళలపై పోలీసులు విచక్షణారహితంగా దాడి చేశారని చెవిరెడ్డి ఆరోపించారు. తప్పు చేసిన వారిని వదిలేసి అప్పగించిన వారిపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. లక్ష్మీని పీఎస్‌కు తీసుకెళ్లకుండా పలు ప్రాంతాలకు తిప్పుతున్నారని చెప్పారు. తనను కూడా అరెస్ట్‌ చేసి పీఎస్‌కు తీసుకెళ్లకుండా రాంత్రంతా రోడ్లపైనే తిప్పారన్నారు. త

తన భార్య, బిడ్డలతో ఫోన్‌ లో మాట్లాడేందుకు కూడా అనుమతి ఇవ్వలేదన్నారు. టీడీపీ ప్రభుత్వ దుర్మార్గాలను ఎన్నికల సంఘం అధికారుల దృష్టికి తీసుకు వెళతామని చెప్పారు. ఎస్పీ భార్య చంద్రబాబు నాయుడు బంధువు అని, అందుకే ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపు చర్యలకు దిగారని అన్నారు.