వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా (MLA Roja) భర్త, ప్రముఖ దర్శకుడు ఆర్కే సెల్వమణిపై (RK Selvamani) అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. చెన్నైలోని మేజిస్ట్రేట్ కోర్టు ఈ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా (MLA Roja) భర్త, ప్రముఖ దర్శకుడు ఆర్కే సెల్వమణిపై (RK Selvamani) అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. పరువు నష్టం కేసులో విచారణకు హాజరుకాకపోవడంతో చెన్నైలోని మేజిస్ట్రేట్ కోర్టు ఆర్కే సెల్వమణిపై అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. 2016 సెప్టెంబర్ 5వ తేదీన ఓ తమిళ న్యూస్ చానల్‌కు సెల్వమణి, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అరుళ్ అన్బరసు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సమయంలో సినీ ఫైనాన్షియర్ ముఖంచంద్ బోత్రా గురించి పలు విషయాలు వెల్లడించారు. 

అయితే వారిద్దరు తన పరువుకు నష్టం కలిగించే ప్రకటనలు చేశారని పరువుకు నష్టం కలిగించే ప్రకటనలు చేశారని ముఖంచంద్ బోత్రా ఆరోపించారు. వారిద్దరిపై కోర్టులో పరువు నష్టం దావా వేశారు. అలాగే టీవీ చానల్‌ను కూడా శిక్షించాలని కోరారు. వారిద్దరు చేసిన వ్యాఖ్యలు ప్రజల దృష్టిలో తన ప్రతిష్టను దిగజార్చాయని పేర్కొన్నారు. అయితే ఇందుకు సంబంధించి సదురు టీవీ చానల్ అప్పీలో చేయడంతో.. ఈ ఏడాది ఫిబ్రవరి 7న ఆ టీవీ ఛానల్‌పై కేసును కోర్టు కొట్టివేసింది. 

ఇక, కేసు పెండింగ్‌లో ఉనన సమయంలోనే పిటిషనర్ బోత్రా మరణించారు. దీంతో అతని కుమారుడు గగన్‌చంద్ బోత్రా ఈ కేసుకు సంబంధించి పోరాటం కొనసాగిస్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి సెల్వమణి, అన్బరసు కోర్టుకు హాజరుకావడం లేదు. 

తాజాగా ఈ కేసు విచారణకు రాగా.. అప్పుడు కూడా సెల్వమణి, అన్బరసు కోర్టుకు హాజరుకాలేదు. దీంతో జార్జ్ టౌన్‌లోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌లను జారీ చేశారు. ఈ కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 23కు వాయిదా వేశారు. ఆ రోజు కోర్టులో హాజరు కావాల్సిందిగా వారిద్దరని ఆదేశించారు.