క్విడ్ ప్రో కో, మనీలాండరింగ్ అభియోగాలపై 16 నెలలు జైలులో వున్నారని మీరు ఒకవేళ దోషిగా తేలితే తర్వాత సీఎం ఎవరంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు లేఖ రాశారు కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య.

ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య. మీపై అనేక కేసుల్లో విచారణ జరుగుతోందని.. ఒకవేళ మీరు దోషిగా తేలితే, మీ తర్వాత రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు అని జోగయ్య ప్రశ్నించారు. క్విడ్ ప్రో కో, మనీలాండరింగ్ అభియోగాలపై 16 నెలలు జైలులో వున్నారని ఆయన గుర్తుచేశారు. ఏదైనా కేసులో కోర్టు మిమ్మల్ని దోషిగా ప్రకటించి మీరు రాజీనామా చేస్తే.. సీఎం పీఠాన్ని రెడ్లకు ఇస్తారా, లేక కాపులకు ఇస్తారా అని జోగయ్య నిలదీశారు. ఆ సమయంలో మీరు బడుగు బలహీన వర్గాల వైపు మొగ్గు చూపితే .. తామంతా గర్వపడతామని ఆయన పేర్కొన్నారు.

కాగా.. కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పవన్‌కు లేఖ కూడా రాశారు. అయితే ముద్రగడ తీరును తప్పుబట్టారు మాజీ మంత్రి , కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరి రామ జోగయ్య. కాపుల కోసం ఎన్నో పోరాటాలు చేసిన ముద్రగడపై నేటి వరకు వున్న సదభిప్రాయం ఈరోజుతో పోయిందన్నారు. పదవులు ఆశించి కాపు సామాజిక వర్గాన్ని జగన్‌కు తాకట్టు పెట్టే కాపు నాయకుల లిస్టుల ముద్రగడ కూడా చేరిపోయారని జోగయ్య ఆరోపించారు. 

Also Read: పవన్‌పై వ్యాఖ్యలు .. ఇన్నాళ్లు పెద్దమనిషివని అనుకున్నా : ముద్రగడకు హరిరామ జోగయ్య కౌంటర్

గతంలో కాపుల కోసం ఆయన చేసిన ఉద్యమాలు చిత్తశుద్ధితో చేసినవేనని తాను నమ్మానని.. కానీ అవి రాజకీయ లబ్ధి కోసమేనని తేలిపోయిందని హరిరామ జోగయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికలకు ముందు కాపులకు రిజర్వేషన్ కల్పించలేనన్న జగన్‌ను ముద్రగడ ఎందుకు వ్యతిరేకించలేదని ఆయన ప్రశ్నించారు. 2019 ఎన్నికల సమయంలో ఆయన తెర వెనుక జగన్‌కు మద్ధతు పలికి, జనసేనకు ఓట్లు పడకుండా చేశారని జోగయ్య ఆరోపించారు. ఉద్యమం మధ్యలో రాజీనామా చేసి కాపు ఉద్యమాన్ని గంగలో కలిపింది ముద్రగడేనంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 

పవన్ కల్యాణ్‌పై అభాండాలు వేస్తున్నారని హరిరామ జోగయ్య మండిపడ్డారు. ద్వారంపూడికి ముద్రగడ మద్ధతుగా నిలబడటం సిగ్గుచేటని.. కాకినాడలో పవన్‌ను పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరే ముందు ప్రత్తిపాడులో నిలబడి గెలిచి చూపాలని పెద్దాయన చురకలంటించారు. అవినీతి వైసీపీలో చేరి వున్న పేరును చెడగొట్టుకోవద్దని ముద్రగడకు హితవు పలికారు. జగన్‌ను కాపాడేందుకు అనవసర వ్యాఖ్యలు చేయకుండా.. నోరుమూసుకుంటే మంచిదని హరిరామ జోగయ్య వార్నింగ్ ఇచ్చారు. లక్షలాది మంది కాపులు లక్ష్యానికి దగ్గరవుతున్న నేపథ్యంలో దానిని చెడగొట్టేందుకు ముద్రగడ చేస్తున్న ప్రయత్నం వెనుక జగన్ హస్తం లేదా అంటూ ఆయన ప్రశ్నించారు.