రాయపూర్: ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ లో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 24మంది జవాన్లు చనిపోయిన విషయం తెలిసిందే. ఇలా చనిపోయిన వారిలో ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఇద్దరు జవాన్లు కూడా వున్నారు. దీంతో ఏపీ సీఎం జగన్ జవాన్ల మృతికి సంతాపం ప్రకటిస్తూ వారి కుటుంబాలకు భారీగా ఆర్థికసాయం ప్రకటించారు.

''ఛత్తీస్‌గఢ్‌ ఘటనలో జవాన్ల మృతి పట్ల సీఎం వైయస్‌.జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని సీఎం పేర్కొన్నారు. మృతుల్లో రాష్ట్రానికి చెందిన ఇద్దరు జవాన్ల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఇరు కుటుంబాలకు రూ.30లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు'' అంటూ సీఎంవో కార్యాలయం వెల్లడించింది. 

read more   జవాన్ల త్యాగం వృథాపోదు.. మావోలకు ధీటుగా బదులిస్తాం: అమిత్ షా హెచ్చరిక

విజయనగరం జిల్లా గాజులరేగకు చెందిన జవాను రౌతు జగదీష్, గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడికి చెందిన శాఖమూరి మురళీకృష్ణ కుటుంబాలకు చెరో రూ.30లక్షల చొప్పున ముఖ్యమంత్రి ఆర్థిక సహాయం ప్రకటించారు. ఈ సహాయాన్ని వెనువెంటనే అందించి బాధిత కుటుంబాలకు బాసటగా నిలవాలని ముఖ్యమంత్రి తన కార్యాలయ అధికారులను ఆదేశించారు. మావోయిస్టుల దాడిలో మరణించిన ఆంధ్రప్రదేశ్ జవాన్లు ఇద్దరు కూడా కోబ్రా దళానికి చెందినవారు.