Asianet News TeluguAsianet News Telugu

చంద్రగిరిలో పొలిటికల్ హీట్: చెవిరెడ్డిపై పోటీకి పులివర్తి నాని

శీతాకాలం చలి చంపేస్తుంటే చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో రాజకీయ వేడి రాజుకుంటోంది. రాజకీయ వేడితో ఉష్ణోగ్రతలు ఆకాశాన్నంటుతున్నాయి. వైసీపీ, టీడీపీ ల మధ్య పోరుతో చంద్రగిరి రాజకీయం మాంచి రంజుగా కనబడుతోంది. 

chandragiri tdp candidate pulivarthi nai
Author
Chittoor, First Published Dec 20, 2018, 9:20 AM IST

చిత్తూరు: శీతాకాలం చలి చంపేస్తుంటే చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో రాజకీయ వేడి రాజుకుంటోంది. రాజకీయ వేడితో ఉష్ణోగ్రతలు ఆకాశాన్నంటుతున్నాయి. వైసీపీ, టీడీపీ ల మధ్య పోరుతో చంద్రగిరి రాజకీయం మాంచి రంజుగా కనబడుతోంది. 

చంద్రగిరి నియోజకవర్గంపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కన్నేశారు. ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉన్న ఆ నియోజకవర్గంలో మళ్లీ పాగా వెయ్యాలని భావిస్తున్నారు. అందులో భాగంగా ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఢీకొట్టే అభ్యర్థికోసం వెతికి చివరికి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నానిని బరిలోకి దింపారు చంద్రబాబు. 

2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ప్రకటించిన తొలి అభ్యర్థి కూడా పులవర్తి నానియే కావొచ్చు. ఈ నియోజకవర్గంపై పులివర్తి నానికి మంచి పట్టుంది. పులివర్తి నాని వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా కష్టపడి పనిచేస్తే ఓడించే అవకాశం ఉందని కూడా చంద్రబాబు ఆశపడుతున్నారు. 

తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా చంద్రగిరి నియోజకవర్గం ఉండేది. అయితే గల్లా అరుణ కుమారి ప్రవేశంతో కంచుకోటకు బీటలు వారింది. ఏకంగా మూడు పర్యాయాలు టీడీపీ అడ్రస్ లేకుండా పోయింది. 

రాష్ట్ర విభజన అనంతరం మాజీమంత్రి గల్లా అరుణ కుమారి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి కుమారుడు గల్లా జయదేవ్ తో కలిసి సైకిలెక్కేశారు. దీంతో 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గల్లా అరుణకుమారి తెలుగుదేశం పార్టీ తరపున చంద్రగిరి నుంచి పోటీ చేశారు. అటు వైసీపీ తరపున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేశారు. ఈ పోరులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గెలుపొందగా గల్లా అరుణ కుమారి ఓటమి పాలయ్యారు. 

గల్లా అరుణ కుమారి మూడు పర్యాయాలుు వరుసగా విజయం సాధించడంతో ఆమె ద్వారా అయిన చంద్రగిరిలో టీడీపీ జెండా ఎగురవెయ్యాలని భావించారు చంద్రబాబు. కానీ ఆయన ఆశలు ఆడియాసలు అయ్యాయి. అయితే 2019 ఎన్నికల్లో అయినా చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగురవెయ్యాలని భావిస్తున్నారు. 

అయితే 2019 ఎన్నికల్లో మళ్లీ చంద్రగిరి నుంచి గల్లా అరుణ కుమారిని బరిలోకి దింపుదామని చంద్రబాబు నాయుడు ప్లాన్ వేశారు. అయితే గల్లా పోటీ చేసేందుకు విముఖుత చూపారు. దీంతో అభ్యర్థి వేటలో పడ్డారు చంద్రబాబు. 

ఇకపోతే వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యూహాత్మక రాజకీయాలకు పెట్టింది పేరు. చెవిరెడ్డికి చెక్ పెట్టాలంటే బలమైన అభ్యర్థి కావాలని చంద్రబాబు అన్వేషణ ప్రారంభించారు. చెవిరెడ్డికి పోటీ ఇవ్వగల సత్తా టీడీపీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నానికి మాత్రమే ఉందని చంద్రబాబు భావించారు. దీంతో నానిని చంద్రగిరి అభ్యర్థిగా ప్రకటించేశారు.  

పులివర్తి నానిది పాకాల మండలం పులివర్తిపాలెం గ్రామం. వాస్తవానికి పులివర్తి నానికి నియోకవర్గంలో మంచి పట్టు ఉంది. దాన్ని గమనించే చంద్రబాబు నాయుడు ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు సమాచారం. 

రాజకీయ కుటుంబానికి చెందిన నాని వార్డు మెంబరు స్థాయినుంచి టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఎదిగారు. 2001లో పులివర్తిపాలెం సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. అనంతరం టీడీపీ తెలుగు యువత జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 

పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా టీడీపీ బలోపేతానికి అలుపెరుగని కృషిచెయ్యడంతో చంద్రబాబు దృష్టి ఆయనపై పడింది. అంతేకాదు పులివర్తి నాని ఐటీ మంత్రి నారా లోకేష్ కు వీరవిధేయుడు. ఈ కారణాలతోనే చెవిరెడ్డిపై పోటీకి నానిని ఎంపిక చేశారని తెలుస్తోంది. 


పులివర్తి నాని చంద్రగిరిలో తన మార్క్‌ రాజకీయం ప్రారంభించారు. నియోజకవర్గంలో తిష్టవేసి అసంతృప్తులను బుజ్జగించే పనిలోపడ్డారు. అంతేకాదు చెవిరెడ్డి వ్యతిరేక వర్గాన్ని దగ్గరకు చేసుకునే ప్రయత్నాలు సైతం ప్రారంభించారు. వ్యతిరేకులందర్నీ ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు పావులు కదుపుతున్నారు. 

నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని చుట్టేస్తున్నారు పులివర్తి నాని. ప్రజాసమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. అన్ని వర్గాలతో సమావేశాలను ఏర్పాటు చేసి తనకు ఓటెయ్యాలంటూ అప్పుడే ప్రచారం మెుదలుపెట్టేశారట. 

ఎన్నికల ప్రచారరథాన్ని సైతం సిద్ధం చేసుకున్నారట. అంతేకాదు వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై విమర్శలు దాడికి దిగుతున్నారట. దీంతో నియోజకవర్గంలో అప్పుడే ఎన్నికల సెగ వేడిపుట్టిస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే ఇక ఎన్నికల ప్రచారంలో ఇరువురు నేతలు బరిలోకి దిగితే ఇక సమరమే అన్నట్లు ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. 

చిత్తూరు జిల్లాలో చంద్రగిరి నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. హేమాహేమీలైన నేతలు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 1978లో కాంగ్రెస్ పార్టీ తరపున చంద్రబాబు నాయుడు తొలిసారిగా పోటీ చేసి చట్టసభలో అడుగుపెట్టారు. 

తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఈ నియోజకవర్గం ఆ పార్టీకి కంచుకోట అయ్యింది. 1983, 1985,1994 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు వరుస విజయాలు సాధించారు. 1989, 1999, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున గల్లా అరుణ కుమారి పోటీ చేసి గెలుపొందారు. ఇక 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గెలుపొందారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios