Asianet News TeluguAsianet News Telugu

హాట్ టాపిక్ గా చంద్రబాబు ఢిల్లీ టూర్.. టీడీపీ-జనసేన-బీజేపీ కొత్త పొత్తుపొడుస్తుందా?

చంద్రబాబు నాయుడు, అమిత్ షాల భేటీల తరువాత.. పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్ల తర్వాతే పొత్తులపై క్లారిటీ రానుంది.  దీనికి ఒకటి రెండు రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. 

Chandrababus Delhi tour as a hot topic.. Will TDP-Janasena-BJP form a new alliance? - bsb
Author
First Published Feb 7, 2024, 4:15 PM IST | Last Updated Feb 7, 2024, 4:15 PM IST

అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కొత్త పొత్తులు, సరికొత్త ఎత్తులు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇప్పటివరకు టిడిపి- జనసేన  పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే. గత కొద్దికాలం నుంచి బీజేపీ కూడా టిడిపి-జనసేన కూటమితో పొత్తు పెట్టుకుంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  ఈ క్రమంలోనే బుధవారం నాడు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లడం, అమిత్ షా తో భేటి అవుతుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే ఢిల్లీ బయలుదేరిన చంద్రబాబు నాయుడు రాత్రికి అమిత్ షాతో సమావేశమయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడు, అమిత్ షాతో పాటు జెసి నడ్డా కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్లుగా సమాచారం.

టిడిపితో పొత్తు కోరుకుంటుండడం వల్లనే చంద్రబాబును ఢిల్లీకి రమ్మని అమిత్ షా ఫోన్ చేసినట్లుగా తెలుస్తోంది.  వినిపిస్తున్నాయి. అయితే, ఈ భేటీకి బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి వెళుతున్న సూచనలు ఏమీ కనిపించడం లేదు.  మరోవైపు, చంద్రబాబు నాయుడు బుధవారం సాయంత్రం అమిత్ షాతో భేటీ అవుతారని ఒకవేళ బుధవారం కుదరకపోతే గురువారం నాడు కచ్చితంగా భేటీ అవుతారని తెలుస్తోంది.

ఆ తర్వాత రెండు రోజులకు అంటే 9వ తారీఖున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్ళనున్నారు.  ఇప్పటికే బీజేపీ జనసేన పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు బిజెపిటిడిపి పొత్తు పెట్టుకున్నట్లయితే… టిడిపి-జనసేన పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ కు విషయం తెలపాల్సి ఉంటుంది. కాగా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం ఉదయం స్వయంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకి ఫోన్ చేశారు.

ఢిల్లీకి బాబు: మిత్రపక్షాలకు సీట్ల కేటాయింపుపై పార్టీ నేతలతో చర్చ

‘కూర్చొని మాట్లాడుకుందాం.. రమ్మని ఢిల్లీకి ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకే చంద్రబాబు ఢిల్లీకి పయనమయ్యారు. చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ కు ముందుగా నాలుగు నెలల క్రితం ఒకసారి అమిత్ షాతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఆ తర్వాత చంద్రబాబు అరెస్ట్ అవడం, బెయిల్ మీద బయటికి రావడం ఈ క్రమంలో చంద్రబాబు,  అమిత్ షాతో పొత్తు విషయం మాట్లాడడం మళ్ళీ కుదరలేదు.

చంద్రబాబు అరెస్టు సమయంలో నారా లోకేష్ రెండుసార్లు అమిత్ షాతో భేటీ అయ్యారు. తండ్రి అరెస్ట్ ఆంధ్ర ప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాల మీద వివరించారు. ఆ సమయంలో టిడిపి తో పొత్తు విషయంలో బిజెపి వెనక్కి తగ్గిందని కూడా వార్తలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు జైలు నుంచి బయటికి రావడం.. జైలులో ఉన్నప్పుడే జనసేనతో పొత్తు ప్రకటించడం.. దూకుడుగా ముందుకు వెళుతుండడంతో బిజెపి- టిడిపితో పొత్తుకు ఆసక్తి చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. 

చంద్రబాబు నాయుడు ఢిల్లీకి బయలుదేరేముందు అందుబాటులో ఉన్న ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. వీరిలో అచ్చెన్నాయుడు, కళావెంకట్రావు, రామానాయుడు, స్వామి తదితరులు ఉన్నారు. బిజెపితో పొత్తు కుదిరినా.. కీలక స్థానాల విషయంలో మాత్రం పట్టు విడువకూడదని సీనియర్ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే వివిధ నియోజకవర్గాల్లో టిడిపి ఆశావహులు ఎక్కువగా ఉండడంతో తర్జనభర్జనలు నడిచాయి. అదే సమయంలో 2014లో బిజెపితో పొత్తు వల్ల జరిగిన నష్టం మళ్లీ రిపీట్ కాకుండా చూసుకోవాలని కూడా టిడిపి నేతలు భావిస్తున్నారని సమాచారం.

 ఇదిలా ఉండగా,  చంద్రబాబు,  అమిత్ షా భేటీ.. పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్ల తర్వాతే పొత్తులపై క్లారిటీ రానుంది.  దీనికి ఒకటి రెండు రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. టిడిపి తో పొత్తు సందర్భంగా బిజెపి పది అసెంబ్లీ స్థానాలను,  ఏడు లోక్సభ స్థానాలను కోరుతోంది.  అసెంబ్లీ స్థానాల విషయంలో కాస్త పట్టువిడుపులు ప్రదర్శించిన లోక్సభ స్థానాల విషయంలో మాత్రం బిజెపి పట్టుపట్టే అవకాశం ఉన్నట్లుగా సమాచారం.

గతంలో గెలిచిన విశాఖ నార్త్, రాజమండ్రి అర్బన్, తాడేపల్లి గూడెం, కైకలూరు అసెంబ్లీ స్థానాల సహ మరో ఆరు స్థానాలు బీజేపీ కోరుతోంది. అరకు, విశాఖ, రాజమండ్రి, నరసాపురం, ఒంగోలు, రాజంపేట, తిరుపతి ఎంపీ స్థానాలు తమకు కావాలని అడగనుంది. 

బీజేపీ - జనసేన పార్టీల రెండింటికీ కలిపి 30 అసెంబ్లీ, 5 లేదా 6 ఎంపీ స్థానాలిచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున ఏం జరగబోతోందో వేచి చూడాల్సి ఉంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios