అమరావతి:  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు శుక్రవారం నాడు ఢిల్లీకి వెళ్లనున్నారు. చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ బూత్‌ల్లో రీ పోలింగ్ నిర్వహణకు సంబంధించి బాబు ఈసీ అధికారులను కలవనున్నారు.

చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో  ఈ నెల 19న రీ పోలింగ్ నిర్వహించాలని  ఈసీ నిర్ణయం తీసుకొంది. వైసీపీ ఫిర్యాదు మేరకు ఈసీ రీ పోలింగ్‌పై నిర్ణయం తీసుకొందని టీడీపీ ఆరోపిస్తోంది. 

రీ పోలింగ్‌ విషయంలో సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం పాత్రపై కూడ టీడీపీ విమర్శలు చేస్తోంది. ఈ విమర్శలను ఎల్వీ సుబ్రమణ్యం ఖండించారు.

శుక్రవారం నాడు మధ్యాహ్నం ఒంటి గంటకు సీఈసీ సునీల్ ఆరోరాతో బాబు సమావేశం కానున్నారు. ఈ విషయమై టీడీపీ నేతలు గురువారం నాడు తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో  రీ పోలింగ్ నిర్వహణకు సంబంధించిన అంశంపై సునీల్ ఆరోరా‌తో బాబు భేటీ అయి రీ పోలింగ్ విషయమై నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉంది.

ఇవాళ సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఎన్సీపీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లాతో కూడ బాబు భేటీ కానున్నారు. వీలైతే శుక్రవారం రాత్రి లక్నోకు వెళ్లి బీఎష్పీ చీఫ్ మాయావతితో కూడ బాబు బేటీ కానున్నారు.ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఆయా పార్టీల నేతలతో  బాబు చర్చించనున్నారు.