అనంతపురం: ఏపీ ప్రజలు బాధలో ఉన్నప్పుడు మోడీ ఎందుకు వస్తున్నారని  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. కేంద్రంతో విబేధించామని రాష్ట్రానికి ఇచ్చిన నిధులను కూడ కేంద్రం వెనక్కు తీసుకొందని బాబు విమర్శించారు. అన్యాయం చేసి... మమ్మల్ని ఎగతాళి చేసేందుకు మోడీ ఏపీకి వస్తున్నారా అని బాబు ప్రశ్నించారు.

బుధవారం నాడు అనంతపురంలో  జరిగిన టీడీపీ ధర్మపోరాట దీక్షలో  ఏపీ సీఎం  చంద్రబాబునాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఏపీకి ప్రత్యేక హోదా అడిగితే ప్రత్యేక ప్యాకేజీ అంటూ మాయమాటలు చెప్పి మోసం చేశారని చెప్పారు. నాలుగేళ్ల తర్వాత కూడ బీజేపీ హోదా కానీ, ప్యాకేజీ ఇవ్వకుండా మోసం చేసిందన్నారు.

ఏపీకి అన్యాయం చేసిన బీజేపీని... ఆ పార్టీలకు వంతపాడే పార్టీలను చిత్తు చిత్తుగా ఓడించాలని చంద్రబాబునాయుడు కోరారు.పోలవరం  ప్రాజెక్టు చివరి దశకు వచ్చిందన్నారు. వచ్చే ఏడాది  మే మాసం లోపుగాగ్రావిటీ ద్వారా నీటిని అందిస్తామని చెప్పారు. కడప స్టీల్ ఫ్యాక్టరీకి రేపు శంకుస్థాపన చేస్తామన్నారు. తమ పోరాటం భావి తరాల కోసమేనని చంద్రబాబునాయుడు చెప్పారు

కేసుల మాఫీ కోసం వైసీపీ రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టిందన్నారు. ఏపీకి న్యాయం చేయాలంటే ఐటీ దాడులు చేస్తూ టీడీపీకి చెందిన ఎంపీలను భయబ్రాంతులను చేస్తున్నారని  చెప్పారు.

ఏ ముఖం పెట్టుకొని మోడీ రాష్ట్రానికి వస్తున్నారని చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. ఏపీకి న్యాయం చేయకుండా చచ్చామా, బతికామా చూసేందుకు మోడీ వస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు. 

రెండు రాష్ట్రాల మధ్య ఉన్నసమస్యలను పరిష్కరించుకోవాలని తాను కేంద్రంతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని కోరితే స్పందించలేదని చంద్రబాబు నాయుడు ఆరోపించారు.

కేంద్రం రాష్ట్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. కేంద్రంతో పోరాడుతూనే మరో వైపు ఎక్కడిక్కడ అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించినట్టు ఆయన గుర్తు చేశారు.

కేంద్రంపై అవిశ్వాసం పెట్టిన సమయంలో  వైసీపీ ఎంపీలు పోరాటం చేయకుండా రాజీనామాలు చేసి పారిపోయారని చెప్పారు.ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలను అమలు చేయాలని  టీఆర్ఎస్ గతంలో ప్రకటించిందని ఆ తర్వాత యూ టర్న్ తీసుకొన్నారని చెప్పారు. అలాంటి పార్టీ తెలంగాణ విజయం సాధిస్తే ఏపీలో వైసీపీ సంబరాలు చేసుకొంటుందని చెప్పారు.