అమరావతి: తెలంగాణలో ఇంటర్ పరీక్షల ఫలితాలపై కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తే అధికారులు వెళ్లారని.... ఏపీలో మాత్రం అధికారులు తన సమీక్షలకు  రాకూడదని ఈసీ ఎలా ఆదేశాలు ఇస్తోందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రశ్నించారు.

బుధవారం నాడు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అమరావతిలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం సమీక్షకు  అధికారులు హాజరు కావడం విషయం తనకు సంబంధం లేదని.... ఏపీలో ఈసీ ఆదేశాలను కచ్చితంగా అమలు చేస్తానని ద్వివేది చెప్పడంలో సహేతుకత ఏముందని బాబు ప్రశ్నించారు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఈసీ రూల్స్ ఉంటాయా అని ఆయన ప్రశ్నించారు.

వీవీప్యాట్ స్లిప్పులను 50 శాతం లెక్కించాలని ఆయన డిమాండ్ చేశారు. నవంబర్, డిసెంబర్ మాసాల్లో ఈవీఎంలను మరమ్మత్తులు చేశారని బాబు చెప్పారు. ఈవీఎంల పనితీరుపై అనుమానాలు ఉన్నాయని బాబు అభిప్రాయపడ్డారు.

ఈవీఎంల పనితీరుపై వచ్చిన సందేహలను నివృత్తి చేయాల్సిన అవసరం ఈసీపై ఉందన్నారు. 50 శాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని ఆయన కోరారు. ఈ విషయమై తాము సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేసినట్టుగా ఆయన గుర్తు చేశారు. 

తుఫాన్ వల్ల ఇబ్బందికి గురయ్యే ఒడిశాలోని కొన్ని జిల్లాలకు ఎన్నికల కోడ్ ను ఎత్తివేసినట్టుగా సమాచారం వచ్చిందన్నారు. అయితే ఏపీలో కూడ తుఫాన్ ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున ఎన్నికల కోడ్‌ను ఎత్తివేయాలని  ఆయన డిమాండ్ చేశారు. 

ఈ విషయమై ఎన్నికల కమిషన్‌కు లేఖ రాయాలని కోరినట్టుగా ఆయన తెలిపారు.  బీజేపీకి, బీజేపీయేతర పార్టీలకు ఎన్నికల కోడ్ వేర్వేరుగా ఉందని చంద్రబాబునాయుడు దుయ్యబట్టారు.

ప్రధాని మోడీ ఏం మాట్లాడినా కూడ ఎన్నికల కోడ్ వర్తించదా అని బాబు ప్రశ్నించారు. ప్రధాని మోడీ ఇచ్చిన సూచనలు, సలహాల ఆధారంగా ఫణి తుఫాన్‌పై ఆయా రాష్ట్రాల్లో చేపట్టాల్సిన చర్యలపై కేంద్ర సంస్థ చేసిన ప్రకటనను ఆయన ప్రస్తావించారు. 

ప్రధానమంత్రికి ఎన్నికల కోడ్ వర్తించదా అని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్షాలను ఎలా కంట్రోల్ చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈసీ ఉందని  బాబు విమర్శించారు. ప్రధాన మంత్రి మోడీ చౌకబారు విమర్శలు చేస్తున్నారని ఆయన చెప్పారు.

అనేక రాష్ట్రాల్లో  జరిగిన ఎన్నికల్లో ఈవీఎంలు మెరాయించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలనేదే తమ డిమాండ్ అని బాబు తెలిపారు.

చాలా దేశాల్లో బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నాయన్నారు. యూపీలో ఎస్పీకి ఓటేస్తే బీజేపీకి ఒట్లు పడ్డాయని ఆయన ఆరోపించారు. చాలా రాష్ట్రాల్లో కూడ ఇదే విధంగా జరిగిందని చంద్రబాబునాయుడు ఆరోపించారు.తుఫాన్లు వచ్చినా ముఖ్యమంత్రులు సమీక్షలు చేయొద్దా అని బాబు ప్రశ్నించారు. ప్రధానమంత్రికి ఓ రూల్, ముఖ్యమంత్రులకు ఓ రూలా అని ఆయన ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

వైఎస్ వివేకాను ఎవరు చంపారో ఎందుకు బయటపెట్టలేదు

వివరణ కోరా: సీఎస్ వ్యాఖ్యలపై భగ్గుమన్న చంద్రబాబు

పవార్ వ్యాఖ్యల ఎఫెక్ట్: ప్రధాని రేసుపై చంద్రబాబు స్పందన