అమరావతి: రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ కొనుగోలుకు రూ. 1600 కోట్లు అవసరమైతే కేవలం రూ. 45 కోట్లు మాత్రమే ఏపీ ప్రభుత్వం మంజూరు చేయడం ప్రజల ప్రాణాలపై జగన్ సర్కార్ కు ఉన్న ప్రేమను తెలుపుతోందని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు చెప్పారు. సోమవారం నాడు  తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన ముఖ్య నేతల సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులపై చర్చించారు.

ఏప్రిల్‌ 21వ తేదీన సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఒక పత్రికా ప్రకటన ద్వారా తయారుచేసిన దానిలో 50% వ్యాక్సిన్‌ రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రైవేటు హాస్పిటల్స్ కు ఇచ్చే విధంగా కేంద్రం విధానం తెచ్చిందన్నారు. వ్యాక్సిన్‌ ధరలను కూడా నిర్ణయించింది. ఈ విధానం మేరకు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కోట్ల డోసుల కోసం సీరం ఇన్‌స్టిట్యూట్‌కు, భారత్‌ బయోటెక్‌కు ఆర్డర్లు పెట్టడమే కాక అడ్వాన్సు చెక్కులను కూడా ఇచ్చి వ్యాక్సిన్‌ పొందుతున్నాయన్నారు.

also read:కరోనాపై చంద్రబాబు విషప్రచారం దేశద్రోహమే: సజ్జల రామకృష్ణారెడ్డి

 మహారాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్‌ టెండర్లు కూడా పిలిచింది. మరి జగన్‌రెడ్డి ప్రభుత్వం ఎందుకు వ్యాక్సిన్‌ కోసం ఆర్డర్లు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు.వ్యాక్సిన్‌కు రూ.1,600 కోట్లు అవసరం కాగా, మే 5న జరిగిన క్యాబినెట్‌లో రూ.45 కోట్లు మాత్రమే మంజూరు చేశారంటే మీరు ప్రజల ప్రాణాలకు ఇచ్చే విలువ ఇదేనా? అని సమావేశం జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కడప జిల్లా మామిళ్ళపల్లె బెరైటీస్‌ గనుల్లో అక్రమ మైనింగ్‌ కోసం తెచ్చిన జిలిటెన్‌ స్టిక్స్‌ పేలుళ్లలో 10 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై చర్చించారు.  మైన్‌ నిర్వాహకుడు వైసీపీ నేతను ఎందుకు అరెస్టు చేయలేదని టీడీపీ చీఫ్ ప్రశ్నించారు. 

రాష్ట్రంలో టీడీపీ నేతలపై  అక్రమంగా కేసులు బనాయించడాన్ని సమావేశం తప్పుబట్టింది. సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరించే విధంగా ప్రతిపక్ష నేతపైన అక్రమ కేసు పెట్టారని సమావేశం అభిప్రాయపడింది. నారా లోకేష్‌, ధూళిపాళ్ల నరేంద్ర, దేవినేని ఉమామహేశ్వరరావు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తదితర తెలుగుదేశం నేతలపై అక్రమ కేసులు పెట్టడాన్ని తీవ్రంగా సమావేశం ఖండించింది.

రెండేళ్లలోనే జగన్‌రెడ్డి ప్రభుత్వం 10 వేల ఎకరాల అసైన్‌మెంట్‌ భూములను బడుగు, దళిత వర్గాల నుండి స్వాధీనం చేసుకొన్నారు - దీనిపై ప్రైవేట్ కేసులతోపాటు, న్యాయస్థానాలలో పోరాటం చేయాని తీర్మానించారు.కరోనా బాధితులకు  ప్యాకేజీ ఇవ్వాలని  సమావేశం డిమాండ్ చేసింది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ అమ్మ క్యాంటీన్లు కొనసాగించాలని తీసుకొన్న నిర్ణయాన్ని నేతలు అభినందించారు.