అమరావతి: బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకోవడాన్ని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు స్వాగతించారు. బీజేపీ, జనసేనల మధ్య పొత్తు తప్పుకాదని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. 

 అమరావతి పరిరక్షణ యాత్రలో భాగంగా శనివారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో చంద్రబాబు మాట్లాడారు. శివరామకృష్ణ కమిటీ రాజధాని ఏర్పాటుకు విజయవాడ, గుంటూరు జిల్లాలకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చిందని చంద్రబాబునాయుడు గుర్తు చేశారు. 

ఈ కారణంగానే  29 వేల మంది రైతుల నుంచి 33 వేల ఎకరాలను రాజధాని నిర్మాణం కోసం భూమిని సేకరించామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బోగస్‌ కమిటీల నివేదికలతో అమరావతి నుంచి రాజధానిని విశాఖపట్నం తరలించడానికి కుట్ర చేస్తున్నారని చంద్రబాబు విమర్శలు గుప్పించారు.

Also read:డ్యాన్స్ లు చేస్తే... నా ముందు దిగదుడుపే: పవన్ పై కేఏ పాల్, జగన్ కు బాసట

విశాఖ జిల్లాలో వైఎస్సార్‌సీపీ నేతలు కొనుగోలు చేసిన భూముల విలువను పెంచుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నారని చంద్రబాబు ఆరోపణలు చేశారు.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోలీసులనే కాదు ఎవరినైనా ఎదిరిస్తానని చంద్రబాబునాయుడు తేల్చి చెప్పారు.

రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి కానరావడం లేదన్నారు. పోలవరం పనులు నిలిచిపోయాయన్నారు. రాష్ట్రంలో తుగ్లక్ పాలన సాగుతోందన్నారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. అమరావతిలోనే రాజధానిని కొనసాగించేలా తమ పోరాటం కొనసాగిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.