అమరావతి: 2019 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. వచ్చే ఏడాది మే నాటికి గ్రావిటీ ద్వారా  నీటిని అందిస్తామన్నారు.

గురువారం నాడు అమరావతిలో  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నీటి పారుదల  ప్రాజెక్టులపై  ఐదో శ్వేత పత్రం విడుదల చేశారు.పోలవరం ప్రాజెక్టుకు 15వేల కోట్లను ఖర్చు చేసినట్టు చెప్పారు. 

జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత రూ.10,065 కోట్లు ఖర్చు చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వం పోలవరం నిర్మాణానికి సంబంధించి రూ.3500 కోట్లు ఇవ్వాల్సి ఉందని బాబు వివరించారు.

వంశధార నుండి పెన్నా నది వరకు అన్ని నదులను అనుసరంధానం చేసినట్టు చెప్పారు. నీటి కొరత ఉన్నప్పుడే దాని విలువ తెలుస్తోందన్నారు. ఇప్పటికే గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేసినట్టు చెప్పారు.

గోదావరి, పెన్నా ఫేజ్ వన్ ను తీసుకురానున్నట్టు  సీఎం బాబు తెలిపారు.రాష్ట్రంలో రెండు కోట్ల ఎకరాల భూమికి నీరిందించాలనే లక్ష్యంగా ముందుకు పోతున్నామని ఆయన తెలిపారు.

పట్టిసీమ ద్వారా 8 లక్షల ఎకరాలకు సాగు నీరు ఇచ్చినట్టు ఆయన గుర్తు చేశారు. పోతిరెడ్డిపాడు ద్వారా 110 టీఎంసీలను రాయలసీమకు నీరిచ్చినట్టు ఆయన తెలిపారు హంద్రీనీవా ద్వారా 30 టీఎంసీల నీరిచ్చినట్టు చెప్పారు.

సాంప్రదాయేతర ఇంధన వనరులను వాడుకొంటే కాలుష్యం తగ్గుతోందన్నారు. 2024 నాటికి ఏపీలో సేంద్రీయ వ్యవసాయాన్ని రైతులు చేస్తారని చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు.