కుప్పం: తాను ఈ ప్రాంతంలో పుట్టకపోయినా.... తనను గుండెల్లో పెట్టుకొన్న కుప్పం నియోజకవర్గ  ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు చెప్పారు.

మంగళశారం నాడు కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పంలో  టీడీపీ చీఫ్  చంద్రబాబునాయుడు పర్యటించారు.ఈ సందర్భంగా  ఆయన  మాట్లాడారు.  ఎమ్మెల్యేగా, సీఎంగా, ప్రతిపక్ష నాయకుడిగా కుప్పం ప్రజల గౌరవాన్ని పెంచేలా తాను పని చేసినట్టుగా ఆయన గుర్తు చేశారు.

అధికారంలో ఉన్న సమయంలో  ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసినట్టుగా ఆయన చెప్పారు. సోమవారం రాత్రి శాంతిపురంలో టీడీపీ ఫ్లెక్సీలను వైసీపీ కార్యకర్తలు తొలగించడాన్ని ఆయన ప్రస్తావించారు. తాను సీఎంగా ఉన్న కాలంలో ఇతర పార్టీలకు చెందిన నేతలు ఎవరొచ్చినా కూడ అడ్డుకోలేదన్నారు.

ఎవరైనా ఎక్కడైనా ప్రచారం నిర్వహించుకొనే హక్కుల ఉందన్నారు. కానీ, శాంతిపురంలో దౌర్జన్యాలు చేశారని ఆయన వైసీపీపై మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో  హింసకు తావులేదన్నారు.

రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఆరుగురు టీడీపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారని ఆయన గుర్తు చేశారు.  మృతి చెందిన ఒక్కో కార్యకర్త కుటుంబానికి రూ. 6 లక్షలను చెల్లించనున్నట్టు ఆయన చెప్పారు.

రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో  పర్యటించి కార్యకర్తల్లో భరోసా నింపుతామన్నారు.  ఎన్నికల వరకే పార్టీలను చూసుకోవాలి....ఎన్నికలు ముగిసిన తర్వాత అభివృద్దిపై కేంద్రీకరించాల్సిన అవసరం ఉందన్నారు.

అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా తాను ప్రజాపక్షంగానే పనిచేశానని ఆయన తెలిపారు.రాష్ట్రంలో టీడీపీ ఓటమికి గల కారణాలను సమీక్షించనున్నట్టుగా ఆయన చెప్పారు.