అమరావతి: స్పీకర్‌గా తమ్మినేని సీతారాంను ఎంపిక చేసిన విషయమై తమకు సమాచారం పంపితే తాము కూడ ఆయనకు మద్దతుగా నిలిచేవాళ్లమని ఏపీశాసనసభలో విపక్ష నేత చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.గతంలో తాను జగన్ వద్దకు మంత్రుల బృందాన్ని కూడ పంపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

గురువారం నాడు ఏపీ స్పీకర్‌గా తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత స్పీకర్ స్థానంలో సీతారాం ను కూర్చొబెట్టేందుకు చంద్రబాబు రాకపోవడంపై అధికార పార్టీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఐదేళ్ల క్రితం ఏపీ స్పీకర్‌గా కోడెల శిప్రసాదరావు‌ను ఎంపిక చేసిన సమయంలో ఈ విషయంలో మంత్రుల బృందాన్ని కూడ జగన్ వద్దకు పంపినట్టుగా ఆయన గుర్తు చేశారు. ఆ సమయంలో కోడెలకు మద్దతుగా జగన్ కూడ నామినేషన్ పత్రాలపై సంతకం చేశారన్నారు.

ఈ దఫా స్పీకర్‌గా తమ్మినేని సీతారాం పేరును ప్రతిపాదించినట్టుగా మీడియాలో తెలుసుకొని సంతోషపడినట్టుగా బాబు చెప్పారు. కానీ, ఈ విషయమై తమను ఎవరూ కూడ సంప్రదించలేదని చంద్రబాబునాయుడు అసెంబ్లీలో ప్రస్తావించారు.

స్పీకర్‌గా ఇవాళ తమ్మినేని సీతారాం స్పీకర్‌గా ఎన్నికైనట్టుగా ప్రకటించిన తర్వాత ఆయనను స్పీకర్ స్థానంలో కూర్చోపెట్టేందుకు రావాలని ప్రొటెం స్పీకర్ కనీసం ఆహ్వానించలేదని చంద్రబాబునాయుడు గుర్తు చేశారు.

పిలవని పేరంటానికి వెళ్లడం పద్దతి కాదని భావించే  తాను తమ పార్టీకి చెందిన డిప్యూటీ లీడర్ అచ్చెన్నాయుడును పంపానని చంద్రబాబునాయుడు వివరణ ఇచ్చారు.  అధికారంలో ఉన్న సమయంలో సంప్రదాయాలను పాటించాం... విపక్షంలో కూడ అదే పద్దతిని కొనసాగిస్తామని బాబు స్పష్టం చేశారు. కానీ, వైసీపీ మాత్రం ఆ రకంగా వ్యవహరించడం లేదన్నారు.

అయితే ఈ సమయంలో  ఏపీ ప్రభుత్వ చీప్ విప్ శ్రీకాంత్ రెడ్డి లేచి చంద్రబాబుకు కౌంటరిచ్చారు. ఐదేళ్ల క్రితం కోడెల శివప్రసాదరావు స్పీకర్‌గా ఎంపిక చేసిన సమయంలో తమ పార్టీ వద్దకు మంత్రుల బృందాన్ని పంపలేదని ఆయన గుర్తు చేశారు. పదే పదే సంప్రదాయాలను ఉల్లంఘించారని ఆయన ఆరోపించారు.  సంప్రదాయాలను ఉల్లంఘించడంలో టీడీపీ నేతలు పీహెచ్‌డీ చేశారని ఆయన ఎద్దేవా చేశారు.

గతంలో సభలో ఎలా ప్రొసిడింగ్స్ జరిగాయో... అదే పద్దతిని ఇవాళ తాము కూడ అనుసరిస్తున్నామని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. అయితే ఈ సమయంలో స్పీకర్ తమ్మినేని సీతారాం జోక్యం చేసుకొన్నారు. ఇప్పటివరకు ఏం జరిగిందో వదిలేయాల్సిందిగా కోరారు.