హైదరాబాద్: మూడు రాజధానులకు ప్రజామోదం ఉందని భావిస్తే అసెంబ్లీని రద్దు చేయాలని ఏపీ సీఎం జగన్ కు చంద్రబాబునాయుడు సవాల్ విసిరారు. ఈ ఎన్నికల్లో అందరం ప్రజల్లో తేల్చుకొందామన్నారు. ఈ విషయమై ప్రజలు మీరు తీసుకొన్న నిర్ణయాన్ని ఆమోదిస్తే తాము అమరావతి గురించి మాట్లాడబోమన్నారు. 

సోమవారం నాడు సాయంత్రం టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడారు. ఈ విషయమై ఏపీ సీఎం వైఎస్ జగన్ కు 48 గంటల  సమయం ఇస్తున్నామని ఆయన చెప్పారు. ఎన్నికల ముందు రాజధాని గురించి మీరు ఏం చెప్పారు, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. 

ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు అసెంబ్లీలో అమరావతిలో రాజధానికి జగన్ మద్దతుగా మాట్లాడిన విషయాలను ఆయన గుర్తు చేశారు. జగన్ తీసుకొన్న నిర్ణయం ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడమే కాదా అని ఆయన ప్రశ్నించారు.

ఐదేళ్లకు ఓటు వేశారని రాష్ట్ర భవిష్యత్తును వైసీపీ నాశనం చేస్తోందని ఆయన ఆరోపించారు.రాజధాని అనేది ఒక్క పార్టీదో, ఒక్క కులానిదో సంబంధించింది కాదు, ఇది ఐదు కోట్ల మంది సమస్య అని ఆయన చెప్పారు. ఎన్నికలకు ముందు జగన్ ఏం చెప్పారు... ఇప్పుడు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

మూడు రాజధానుల నిర్ణయం సరైందని భావిస్తే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలన్నారు. ఎన్నికల్లో ప్రజలు మీకు ఓటేస్తే అమరావతి గురించి తాము మాట్లాడబోమని ఆయన చెప్పారు. 

తాను చేసిన సవాల్ ను స్వీకరిస్తారా.. రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడుస్తారా తేల్చుకోవాలని ఆయన సవాల్ విసిరారు. మీకు  దక్షిణాఫ్రికా ఆదర్శమా అని ఆయన ప్రశ్నించారు.  ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. 

మూడు రాజధానులతో భవిష్యత్తు తరాలు కూడ తీవ్రంగా నస్టపోయే అవకాశం ఉందన్నారు. దేశ విదేశాల్లో ఉన్న  తెలుగు ప్రజలంతా ఈ విషయమై చర్చించాలన్నారు.