విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో ప్రమాదకర విషవాయువు లీకయి పలువురు మృత్యువాతపడ్డారు. అలాగే ఈ వాయువు పీల్చిన చాలామంది అనారోగ్యానికి గురయి ఆస్పత్రిపాలయ్యారు. ఇలా వందల్లో క్షతగాత్రులు వివిధ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారని... వారికి తక్షణమే మెరుగైన వైద్యం అందించే ఏర్పాట్లు చేయాలంటూ కేంద్రమంత్రి పీయూష్ గోయల్‍కు చంద్రబాబు లేఖ రాశారు. 

ఎల్జీ పాలిమర్స్ ప్రమాద బాధితులకు తక్షణమే పూర్తిస్థాయి నిపుణులతో చికిత్స అందించాలని కోరారు. విషవాయువుల కారణంగా దాదాపు 2 వేల మంది అస్వస్థతకు గురయ్యారని.. వారికి జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో చికిత్స అందించాలని కేంద్ర మంత్రిని కోరారు చంద్రబాబు. 

అంతేకాకుండా ప్రజల ప్రాణాలను బలితీసుకున్న గ్యాస్ లీకేజీ ఘటనపై తగిన విచారణ జరిపించాలని... ఈ పరిశ్రమను తక్షణమే మూసివేయించాలని లేఖలో చంద్రబాబు డిమాండ్  చేశారు.  బాధితులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సహకారం అందించాలని కేంద్ర మంత్రిని చంద్రబాబు కోరారు. 

లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతం హైదరాబాద్ లో చిక్కుకుపోయిన చంద్రబాబు విశాఖ దుర్ఘటన నేపథ్యంలో సొంత రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ కు వెళ్లడానికి అనుమతివ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని  కోరారు. విశాఖ వెళ్లి బాధితులను పరామర్శించి పార్టీ తరపున సహాయ చర్యలు చేపట్టేందుకు అనుమతివ్వాలంటూ కేంద్రాన్ని వేడుకున్నారు. ఆయన అభ్యర్థనపై  స్పందించిన కేంద్రం విశాఖకు వెళ్లడానికి చంద్రబాబు అనుమతిచ్చింది. 

ఈరోజు మధ్యాహ్నం 1:30 నిమిషాలకు చంద్రబాబు హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా విశాఖ విమానాశ్రయానికి వెళతారు.అక్కడి నుంచి ఎల్జీ పాలిమర్స్ ప్రాంతానికి, ఆ తర్వాత క్షతగాత్రులను పరామర్శించేందుకు వెళ్లనున్నారు.

ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై ట్విట్టర్ వేదికగా చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఈ ఘటనలో మనుషులే కాకుండా మూగజీవాలు కూడా మృతిచెందాయి. కొన ఊపిరితో ఉన్న ప్రజలను, మూగజీవాలను ప్రభుత్వం వెంటనే కాపాడాలి. ఈ విష వాయువు సుమారు 3 కిలోమీటర్లు వ్యాప్తి చెందడంతో చెట్లన్నీ రంగుమారిపోమయాయి. దీన్ని బట్టి చూస్తే ఆ విషవాయువు తీవ్రత ఏంటో తెలుస్తుంది. యుద్దప్రాతిపదికన వెంటనే ప్రజలందరినీ ప్రభుత్వం ఖాళీ చేయించాలి. గ్యాస్ లీకై ఊళ్లు ఖాళీ చేయాల్సి రావడం బాధాకరం. బాధితులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలి. బాధితులకు వెంటనే అత్యున్నత వైద్య సాయం అందించాలి’ అని చంద్రబాబు కోరారు.