అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపి ప్రభుత్వం నుంచి ఎంపీ రఘురామకృష్ణమ రాజుకు ప్రాణ హాని ఉందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఏపీ గవర్నర్  కు లేఖ రాశారు. లోకసభ ఎంపీ రఘురామ కృష్ణమ రాజును మే 14వ తేదీన హైదరాబాపదులో అక్రమంగా అరెస్టు చేసి గుంటూరులోని సిఐడి కార్యాలయానికి తరలించారని ఆయన అన్నారు.

అదే రోజున ముసుగు వేసుకున్న ఐదుగురు వ్యక్తులు రఘురామపై దారుణంగా కస్టోడియల్ హింసకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.  ఈ నేపథ్యంలో రఘురామ కృష్ణమ రాజును తన వై కేటిగరి భద్రత సమక్షంలో గుంటూరు జనరల్ ఆస్పత్రిలో, ఆ తర్వాత రమేష్ హాస్పీటల్ లో వైద్య పరీక్షలు చేి నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించిందని ఆయన గుర్తు చేశారు.

కానీ పోలీసులు రఘురామను రమేష్ ఆస్పత్రికి వైద్య పరీక్షల నిమిత్తం పంపించకుండా మీడియా కళ్లు గప్పి దొడ్డిదారిన గుంటూరు సబ్ జైలుకు తరలించారని ఆయన ఆరోపించారు. ఆ విషయాన్ని కనీసం రఘురామ కుటుంబ సభ్యులకు కూడా తెలియజేయలేదని ఆయన విమర్శించారు. గతంలో రఘురామకృష్ణమ రాజు స్వయంగా పోలీసు నుంచి, వైసీపి ప్రభుత్వం నుచి తనకు ప్రాణహాని ఉందని అనేక మార్లు చెప్పారని ఆయన అన్నారు. రఘురామకు ఉన్న ప్రాణహానిని గుర్తించి కేంద్ర ప్రభుత్వం వై కెటగిరీ భద్రతను కల్పించిందని ఆయన చెప్పారు. 

రఘురామ కృష్ణమ రాజు సతీమణి రమాదేవి సైతం తన భర్తకు ప్రాణహాని ఉందని చెబుతున్నారని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వ దుశ్చర్యలకు వ్యతిరేకంగా తన గళం విప్పినందుకు ప్రజలు ఎన్నుకున్న ఒక లోకసభ ఎంపీని అక్రమంగా అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్ ప్ఱభుత్వం ఓ సాధారణ నేరస్తుడిలా హింసిస్తోందని ఆయన అన్నారు. ఇటువంటి పరిస్థితిలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని, ఎంపీ రఘురామ ప్రాణాన్ని కాపాడేందుకు కల్పించుకోవాలని ఆయన గవర్నర్ ను కోరారు. 

రఘురామను అంతమొందించే కుట్ర జరుగుతోంది: చినరాజప్ప

జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయమన్నందుకే  ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై ప్రభుత్వం కక్షసాధింపులకు దిగిందని టీడీపీ నేత, మాజీమంత్రి చినరాజప్ప అన్నారు. రఘురామ అరెస్టుపై స్పందించిన ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ఎంపీని అంతమొందించే కుట్ర జరుగుతోందన్నారు. రఘురామ ప్రాణాలకు ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు. 

రూల్ ఆఫ్ లా కంటే లాఠీకే పనిచెబుతున్న పోలీసుల తీరు హేయమన్నారు. వైసీపీ ఎంపీ పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని చినరాజప్ప ప్రశ్నించారు. రఘురామ నేరస్థుడు కాదని.. ప్రభుత్వ అక్రమ కేసులో నిందితుడని అన్నారు. జగన్ కళ్లల్లో ఆనందం చూసేందుకు కొంతమంది పోలీసులు ఇలా హింసిస్తున్నారని, ఏపీలో అరాచకాలపై రాష్ట్రపతి, ప్రధాని, లోక్‌సభ స్పీకర్ స్పందించాలన్నారు. దీనిపై కేంద్ర బృందాలతో న్యాయవిచారాణ జరిపించాలని చినరాజప్ప విజ్ఞప్తి చేశారు.