నాకు మనస్సాక్షి అనేది ఉంటుంది.. : తనపై కామెంట్స్‌కు నారా భువనేశ్వరి కౌంటర్!
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏ తప్పూ చేయలేదని ఆయన సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. ప్రజల సొమ్ము దోచుకుని దాచుకునే అలవాటు చంద్రబాబుకు లేదని చెప్పారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏ తప్పూ చేయలేదని ఆయన సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. ప్రజల సొమ్ము దోచుకుని దాచుకునే అలవాటు చంద్రబాబుకు లేదని చెప్పారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే అప్పటి నుంచి భువనేశ్వరి కూడా జైలుకు కొద్ది దూరంలో ఉన్న క్యాంప్ సైట్‌లో బస చేస్తున్నారు. అయితే తాజాగా బుధవారం ఉదయం చంద్రబాబు నాయుడు కోసం రాజమండ్రిలోని సెయింట్ పాల్స్ లూథరన్ చర్చిలో ప్రత్యేక ప్రార్ధనలో భువనేశ్వరి పాల్గొన్నారు.
అనంతరం చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ తూర్పు గోదావరి జిల్లాలోని సీతానగరంలో టీడీపీ నేతలు కొనసాగిస్తున్న దీక్ష శిబిరం వద్దకు భువనేశ్వరి వెళ్లారు. అక్కడ భువనేశ్వరి మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు ఏం తప్పు చేశారని 19 రోజులుగా జైలులో నిర్భంధించారని ప్రశ్నించారు. ఎలాంటి విచారణ లేకుండానే నిర్బంధిస్తారా? అని అడిగారు. చంద్రబాబుపై ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయారని అన్నారు. చంద్రబాబు 45 రాజకీయ జీవితంలో ఆయనపై ఎన్నో ప్రభుత్వాలు ఎన్నో కేసులు పెట్టాయని.. వాటిలో ఒక్కటి కూడా నిరూపించలేకపోయారని అన్నారు.
తాను ఒక మహిళేనని.. తనకు జరిగింది ఎప్పుడూ మర్చిపోనని భువనేశ్వరి అన్నారు. తన గురించి ఏదేదో మాట్లాడారు.. ఎవరికి తాను నిరూపించుకోవాల్సి ఉంటుందని అన్నారు. తనకు మనస్సాక్షి అనేది ఉంటుందని.. అది తన భర్త నమ్మితే చాలని.. వేరే వాళ్లు ఏం మాట్లాడిన తనకు అనవసరం అని చెప్పారు. ఇక్కడున్న మహిళలకు తాను ఇదే సందేశం ఇస్తున్నానని.. మగాడు ఏదైనా మాట్లాడుతాడని వాటిని పట్టించుకోనవసం లేదని అన్నారు. పనిలేని వాళ్లు ఏదైనా మాట్లాడుతున్నారని.. ఒక ఆడది ఈ సృష్టికి మూలకర్త అని వారు మర్చిపోతున్నారని విమర్శించారు.