ఖబర్దార్! గుర్తు పెట్టుకోండి, మమ్మల్ని దెబ్బ తీయలేరు: బాబు

ఖబర్దార్! గుర్తు పెట్టుకోండి, మమ్మల్ని దెబ్బ తీయలేరు: బాబు

విశాఖ: "ఖబర్దార్! మాతో పెట్టుకోకండి, మమ్మల్ని దెబ్బ తీయలేరు" అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బిజెపిని, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీని హెచ్చరించారు. నమ్మకద్రోహం జరిగిందా, లేదా అని మిమ్మల్ని అడుగుతున్నానని ఆయన అన్నారు.

మంగళవారం సాయంత్రం విశాఖపట్నంలో జరిగిన ధర్మపోరాట సభలో ఆయన ప్రసంగించారు. బిజెపిపై ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. జాతీయ రాజకీయాల్లో ఫ్రంట్లను నిలబెట్టానని ఆయన చెప్పారు. రేపు తాను బెంగళూరు వెళ్తున్నానని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడానికి వెళ్తున్నానని ఆయన చెప్పారు. 

29 సార్లు ఢిల్లీ వెళ్లినా కేంద్రంలో చలనం రాలేదని ఆయన అన్నారు. తన కన్నా సీనియర్లు ఎవరూ లేరని, నాలుగేళ్ల పాటు అన్ని ప్రయత్నాలు చేశానని, ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నానని ఆయన చెప్పారు. తిరుమలపై కూడా పెత్తనం చేయడానికి పురావస్తు శాఖకు ఇవ్వాలని ప్రయత్నించిందని ఆయన అన్నారు. 

మీకు ఏం అధికారం ఉంది, మా వెంకటేశ్వర స్వామిని మీ ఆధీనంలో పెట్టుకోవడానికి అని ఆయన ప్రశ్నించారు. కేంద్రం సహాయ నిరాకరణ ఓవైపు చేస్తూ మరోవైపు కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ఆయన అన్నారు. మొన్నటి వరకు పొగడినవాళ్లు, ఇప్పుడు తిడుతున్నారని ఆయన అన్నారు. విశాఖది ఉక్కు సంకల్పమని అన్నారు. 

అనునిత్యం కుట్రలు ఉంటాయని, జాగ్రత్తగా ఉండాలని ఆయన అన్నారు.  పోలవరం ఏపీకి జీవనాడి అని చంద్రబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయడమే తన జీవిత ఆశయమన్నారు. పట్టిసీమ ద్వారా గోదావరి-కృష్ణా నదులను అనుసంధానం చేశామని గుర్తు చేశారు. నదుల అనుసంధానానికి కేంద్రం సహకరించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

విశాఖ రైల్వేజోన్‌ మన హక్కు అని స్పష్టం చేశారు. రైల్వేజోన్‌ ఇవ్వకపోతే అడ్రస్‌ గల్లంతు చేయాలని ఆయన పిలుపు నిచ్చారు. నాలుగు డివిజన్లు ఉన్నా... రైల్వేజోన్‌ ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. బీజేపీకి వత్తాసు పలికే పార్టీలకు గుణపాఠం చెప్పాలని సూచించారు. తెలుగువారంటే లెక్కలేని తనం ఎందుకు? అని ప్రశ్నించారు. ఆంధ్రులు పన్నులు కట్టడంలేదా అని ప్రశ్నించారు.

కర్ణాటకలో ఏం చేశారో చూశారని, అలా జరగకూడదంటే మనమంతా ఒక్కటిగా ఉండాలని అన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో కొంత మంది బ్రిటిష్ వారి వైపు ఉన్నారని ఆయన అన్నారు.  ఎవరికీ భయపడాల్సిన అవసరంలేదని అన్నారు. టీడీపీ తల్చుకుంటే మీ అడ్రస్‌ గల్లతవడం ఖాయమని హెచ్చరించారు.
 
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఇతర రాష్ట్రాలకు ఇచ్చారని వ్యాఖ్యానించారు. వైసీపీ లాలూచీ రాజకీయాలు చేస్తోందని, హోదా కోసం పార్లమెంట్‌లో, బయట టీడీపీ ఎంపీలు పోరాడారని వెల్లడించారు. అవిశ్వాస తీర్మానం పెడితే అందరూ మద్దతు ఇచ్చారని అన్నారు.

ఏపీకి అన్యాయం చేసిన కాంగ్రెస్‌ అడ్రస్‌ గల్లంతు అయిందని అన్నారు. గుజరాత్‌లో పటేల్‌ విగ్రహానికి రూ.2500కోట్లు ఇచ్చారని, ఏపీ రాజధానికి రూ.1500కోట్లు మాత్రమే ఇచ్చారని చంద్రబాబు తెలిపారు.

నమ్మకద్రోహం, కుట్ర రాజకీయాలపైనే తమ ధర్మ పోరాటమని ముఖ్యమంత్రి అన్నారు. అందుకే ఈ ధర్మ పోరాటానికి వెంకన్న సాక్షిగా నాంది పలికామని ఆయన చెప్పారు. ఆనాటి ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ ఇచ్చిన హామీలను నిలదీయడానికి మొదటి సభ తిరుపతిలో పెట్టామని చెప్పారు. 

కేంద్రంలో మనం చెప్పిన ప్రభుత్వం రావాలని ఆయన అన్నారు. సొంత ప్రయోజనాలను మానుకుని ముందుకు సాగుదామని అన్నారు. వైసిపి అవిశ్వాస తీర్మానానికి స్పందన రాలేదని, తాము అవిశ్వాసం పెడితే అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయని ఆయన అన్నారు.

తనకు వ్యక్తిగత ఎజెండా లేదని, తనది ప్రజల ఎజెండా అని ఆయన అన్నారు. తనకు భార్య తిండి పెట్టాలని చెప్పి చిన్న కంపెనీ పెట్టించానని అన్నారు. 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Andhra Pradesh

Next page