ఏపీ సీఎం  చంద్రబాబు నాయుడు శనివారం తన  మేనల్లుడు ఉదయ్ కుమార్ అంత్యక్రియలకు హాజరయ్యారు. చిత్తూరు జిల్లా కందులవారిపల్లెలో  ఉదయ్ కుమార్ అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య జరిగాయి. 

ఉదయం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట చేరుకున్న సీఎం.. కందులవారిపల్లె చేరుకొని ఉదయ్ కుమార్ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. తన చెల్లెలు హైమావతిని పరామర్శించి కుటుంబసభ్యులను ఓదార్చారు. అనంతరం ఉదయ్ కుమార్ అంతిమయాత్ర ప్రారంభమైంది. 

మంత్రి నారా లోకేష్, సినీహీరో నారా రోహిత్ పాడె మోసి ఉదయ్ కుమార్‌కు తుది వీడ్కోలు పలికారు. వారితో పాటుగా సీఎం చంద్రబాబు అంతిమయాత్రలో పాల్గొన్నారు. దహన క్రియలు పూర్తయిన తర్వాత ఉదయ్ కుమార్ నివాసానికి చేరుకున్న సీఎం తన చెల్లెలు హైమావతిని ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

ఈ అంత్యక్రియల్లో చంద్రబాబు  సతీమణి నారా భువనేశ్వరితో పాటు లోకేష్, బ్రాహ్మణి, సినీ హీరో నారా రోహిత్, మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, సినీ నిర్మాత ఆదిశేషగిరిరావు, చిత్తూరు జిల్లా ప్రజా ప్రతినిధులు ఉదయ్ కుమార్ అంత్యక్రియలకు హాజరై నివాళులర్పించారు.