హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై విడుదలైన ఎగ్జిట్ పోల్ ఫలితాలు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మింగుడుపడేలా కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఉంటూ ఢిల్లీలో ప్రధానిని నిర్ణయించేది తానేనని చెప్పుకున్న చంద్రబాబుకు ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఆయన ఆశలను ఆడియాశలు చేసినట్లయ్యాయి. 

ప్రజల నాడి తెలుసుకోవడంలో ఎగ్జిట్ పోల్స్ విఫలమయ్యాయయని అందుకే చంద్రబాబు ప్రకటన చేసినట్లు కనిపిస్తున్నారు. గతంలో వాస్తవాలకు విరుద్ధంగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

ఢిల్లీని శాసిద్దామంటూ ఇప్పటికీ ఢిల్లీ చుట్టే చంద్రబాబు చక్కర్లు కొడుతున్నారు. అన్ని పార్టీలను ఏకం చేస్తున్న చంద్రబాబు ఇక జాతీయ రాజకీయాల్లో తనకు ఎదురేలేదని భావించారు. ఇలాంటి తరుణంలో ఆయన ఆశలపై నీళ్లు చల్లాయి ఎగ్జిట్ పోల్ ఫలితాలు. ఢిల్లీని శాసిద్ధామనుకున్న చంద్రబాబుకు ఏపీలోనే ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నాయంటూ ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో తేటతెల్లమవుతుంది. 

ఏపీలో తిరిగి చంద్రబాబు నాయుడే అధికారంలోకి వస్తారని రాష్ట్ర స్థాయి సర్వే సంస్థలు అయిన ఆరా, సీపీఎస్ లు కూడా వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని ప్రకటించింది. అంతేకాదు పార్లమెంట్ స్థానాల్లో కూడా అత్యధిక సీట్లు గెలుచుకుంటుందని తెలిపింది. అయితే ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్, ఐఎన్ఎస్ఎస్ మీడియా, ఎలైట్ సర్వే సంస్థలు మాత్రం చంద్రబాబు అనుకూలంగా ఫలితాలు ప్రకటించాయి. 

అయితే మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ఎగ్జిట్ పోల్ ఫలితాలు రివర్స్ కావడంతో ఆయన ఫలితాలను అంతగా విశ్వసించే పరిస్థితి లేకుండా పోయిన పరిస్థితి. నేషనల్ చానెల్స్ అయితే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టాయి. 

జాతీయ మీడియా సంస్థలు ఇండియాటుడే, రిపబ్లిక్ టీవీ, టైమ్స్ నౌ, ఇండియా టీవీ, వీడీపీ అసోషియేట్స్ తోపాటు పలు సర్వే సంస్థలు వైసీపీకే అనుకూలంగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు ప్రకటించాయి. దీంతో ఏపీలో అధికారం చంద్రబాబు చేజారిపోతుందా అన్న సందేహాలు నెలకొన్నాయి. ఏపీలో పరిస్థితి ఇలా ఉంటే కేంద్రంలోనూ చంద్రబాబుకు గట్టి షాక్ తగిలే అవకాశం ఉంది. 

ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షానికే పరిమితమయ్యే ఛాన్స్ ఉందంటూ ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో స్పష్టమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కుంచుకునే అవకాశం లేదని ఎగ్జిట్ పోల్ సర్వేలు పేర్కొన్నాయి. 

కేంద్రంలో ఎన్డీయే హవా ఉంటుందని మేజిక్ ఫిగర్ దాటి స్థానాలు గెలుచుకుంటుందని ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాల్లో తేలింది. 
కేంద్రంలో కాంగ్రెస్ కు కానీ, యూపీఏ కూటమి కానీ ఏ మాత్రం ఛాన్స్ లేదని తేలిపోయింది. దీంతో యూపీఏ కూటమిలో కీలకంగా వ్యవహరించి చక్రం తిప్పాలన్న చంద్రబాబుకు ఆశలు గల్లంతయ్యాయి. 

ఎన్డీఏ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనకు గడ్డుకాలం తప్పదా అన్న చర్చ జరుగుతోంది. గత కొంతకాలంగా ప్రస్తుం ఇప్పటికీ బీజేపీయేతర కూటమి బలోపేతం కోసం చంద్రబాబు నానా తంటాలు పడుతున్నారు. 

బీజేపీకి వ్యతిరేకంగా 22 పార్టీలను ఏకం చేశానని మైకుల ముందు ఊదరగొడుతున్నారు చంద్రబాబు. తన లక్ష్యం మోదీని గద్దె దించడమేనంటూ చంద్రబాబు పదేపదే చెప్పుకొచ్చారు. అందుకు రాజకీయ బద్దశత్రువు అయిన కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపారు. 

యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీని సైతం కలిశారు. 2017 వరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీలను తిట్టని తిట్లు లేకుండా నానా తిట్లు తిట్టారు చంద్రబాబు. అయితే దేశభవిష్యత్ దృష్ట్యా తాము కాంగ్రెస్ పార్టీతో కలవాల్సి వచ్చిందని ప్రజలకు చెప్పుకొచ్చారు. 

ప్రధాని నరేంద్రమోదీ దేశాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని అందువల్ల ఆయనను గద్దె దించడమే మేలని లేని పక్షంలో భారత్ ప్రమాదకరంగా మారే అవకాశం ఉందంటూ చెప్పుకొచ్చారు. మోదీ పేరు ఎత్తితే చాలు మైకుల ముందు విమర్శలతో దాడికి దిగేవారు చంద్రబాబు. 

అలాంటిది ఏపీలో అధికారం కోల్పోయి కేంద్రంలో తాను ఆశించిన పార్టీ అధికారంలోకి రాకపోతే చంద్రబాబు పరిస్థితి ఏంటా అన్న సందేహం నెలకొంది. అయితే ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు చంద్రబాబుకు మింగుడుపడకపోయినా మే 23న విడుదలయ్యే ఫలితాలైనా ఆయనకు కలిసి వస్తాయా లేదో అన్నది వేచి చూడాలి.