ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై బిజెపి అధికార ప్రతినిధి జీవిఎల్ నరసింహా రావు మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై బిజెపి అధికార ప్రతినిధి జీవిఎల్ నరసింహా రావు మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. ప్యాకేజీ బాగుందని చెప్పిన చంద్రబాబు ప్లేటు ఫిరాయించారని ఆయన బుధవారం మీడియాతో అన్నారు.
చంద్రబాబు అభివృద్ధిని పక్కన పెట్టి దీక్షలు, పోరాటాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. శాసనసభ సచివాలయంలో లీకులు చూసైనా మరోసారి తప్పులు దొర్లకుండా చంద్రబాబు చూసుకోవాలని ఆయన అన్నారు. అసెంబ్లీలో జగన్ చేంబర్ లోకి వర్షం నీరు లీక్ కావడంపై ఆయన ఆ విధంగా అన్నారు.
చివరి నిమిషం వరకు తాము టిడీపితో మిత్రధర్మం పాటించినట్లు ఆయన తెలిపారు. ప్రత్యేక హోదా సాధ్యం కాదని తెలిసినా చంద్రబాబు ప్రజలకు అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. టీడీపీనే కాంగ్రెసు దగ్గరయిందని, కర్ణాటక ఎన్నికల్లో ఇది స్పష్టమైందని ఆయన అన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు చేస్తున్న ప్రయత్నాలపై కూడా ఆయన స్పందించారు. అది ఫెడరల్ ఫ్రంట్ కాదు... ఫియర్ ఫుల్ ఫ్రంట్ అని ఆయన వ్యాఖ్యానించారు. బిజెపి విజయాలకు భయపడి ఫ్రంట్ లు అంటున్నారని ఆయన అన్నారు.
Last Updated 2, May 2018, 6:02 PM IST