హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెసుకు దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో తిరిగి బిజెపికి దగ్గర కావాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే లోకసభలో టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. 

బిజెపిపై సమరం సాగిస్తున్న వస్తున్న తెలుగుదేశం పార్టీ ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకుంది. లోకసభ స్పీకర్ పదవికి బిజెపి ఎంపిక చేసిన ఓమ్ బిర్లాకు ఆ పార్టీ మద్దతు తెలిపింది. మోడీ ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇవ్వాలని కూడా నిర్ణయించుకుంది. 

స్పీకర్ గా ఓమ్ బిర్లాను మోడీ ఎంపిక చేయడాన్ని తెలుగుదేశం పార్టీ లోకసభ సభ్యులు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు మద్దతు తెలిపారు. దేశం కోసం మోడీ ప్రభుత్వం తీసుకున్ని మంచి నిర్ణయాలకు అన్నింటికీ తమ పార్టీ మద్దతు ఉంటుందని రామ్మోహన్ నాయుడు చెప్పారు .

సభలో తమ బలం తగ్గినప్పటికీ తమకు కేటాయించే సమయాన్ని తగ్గించకూడదని ఆయన స్పీకర్ ను కోరారు. రాష్ట్రాభివృద్ధికి మోడీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు, ప్రకటించే పథకాలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ఆయన ప్రధాని వైపు చూస్తూ చెప్పారు. 

తెలుగుదేశం పార్టీ 2014లో బిజెపితో పొత్తు పెట్టుకుని ఎపిలో పోటీ చేసిన విషయం తెలిసిందే. బిజెపి ఎమ్మెల్యేలకు చంద్రబాబు మంత్రి పదవులు కూడా ఇచ్చారు. ప్రత్యేక హోదా వివాదంపై తెలుగుదేశం పార్టీ 2017లో బిజెపితో తెగదెంపులు చేసుకుంది.