ఇక చంద్రబాబు దూకుడు: అమరావతి సభకు జాతీయ నేతలు

ఇక చంద్రబాబు దూకుడు: అమరావతి సభకు జాతీయ నేతలు

అమరావతి: జాతీయ స్థాయిలో దూకుడు పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సిద్ధపడుతున్నారు. కుమారస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా పోది చేసుకున్న ఉత్సాహం ఆయనను ముందుకు నడిపిస్తుందని అంటున్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుకు బిజెపిపై పోరాటం సాగిస్తున్న ఆయన జాతీయ స్థాయిలో తనకు మద్దతు కూడగట్టుకోవడానికి ప్రయత్నాలను ముమ్మరం చేయాలని అనుకుంటున్నారు.

బిజెపి ఏ రాష్ట్రంలోనూ ఇక అధికారంలోకి వచ్చే అవకాశం లేదని చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ బుధవారం చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నాయి. అదే సమయంలో జాతీయ స్థాయిలో చంద్రబాబు చక్రం తిప్పుతారని కూడా ఆయన అన్నారు. ఇందుకు తగిన పునాదిని చంద్రబాబు ఏర్పాటు చేసుకుంటారని అంటున్నారు.

కుమారస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చిన ప్రాంతీయ పార్టీల నేతలందరితోనూ చంద్రబాబు చర్చలు జరిపారు. రాష్ట్రాలకు నిధుల కోత వంటి అంశాలపై మమతా బెనర్జీ వంటి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా చంద్రబాబు గొంతు పెంచాలనే అభిప్రాయంతో ఉన్నట్లు కనిపిస్తున్నారు. వామపక్షాల నాయకులు మొదటి నుంచి చంద్రబాబుకు సన్నిహితులే.

వారితో ఉన్న గత అనుబంధాన్ని పునరుద్ధరించుకోవడానికి చంద్రబాబు కుమారస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉపయోగపడిందని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు ధర్మ పోరాట సభలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. చివరి ధర్మ పోరాట సభ అమరావతిలో జరగనుంది. ఈ చివరి ధర్మపోరాట సభకు కాంగ్రెసేతర బిజెపి వ్యతిరేక పార్టీల నాయకులను ఆహ్వానించాలని చంద్రబాబు అనుకుంటున్నారు.

అంతేకాకుండా వచ్చే పార్లమెంటు సమావేశాల్లోగా వివిధ రాష్ట్రాల్లో పర్యటించి తనకు మద్దతు కూడగట్టుకోవాలని ఆయన అనుకుంటున్నారు. మొత్తం మీద చంద్రబాబు దూకుడు పెంచాలని అనుకుంటున్నారు.

జాతీయ స్థాయిలో తృతీయ కూటమి ఏర్పాటుకు ఈ ప్రయత్నాలు ఉపయోగపడుతాయని భావిస్తున్నారు. గతంలో జాతీయ స్థాయిలో నిర్వహించిన పాత్ర కారణంగా చంద్రబాబుకు తృతీయ కూటమి విషయంలో ముందుకు సాగడానికి ఎక్కువ అవకాశాలున్నాయని అంటున్నారు. దానికి తోడు, వామపక్షాల నేతలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ తో కన్నా చంద్రబాబుతో కలిసి పనిచేయడానికే ఎక్కువ ఇష్టపడుతాయి.  

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Andhra Pradesh

Next page