అమరావతి: పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై తమ పార్టీ పార్లమెంటు సభ్యులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మార్గనిర్దేశం చేశారు. పార్టీ ఎంపీలు ఢిల్లీలోని సుజనా చౌదరి నివాసంలో బుధవారం ఉదయం సమావేశమయ్యారు. వారితో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఇటీవల సచివాలయానికి వచ్చి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తనతో జరిపిన చర్చల వివరాలను ఆయన ఎంపీలకు వ్యవహరించారు. తలుపులు మూసి రాష్ట్ర విభజన చేశారని విమర్శించిన ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎందుకు న్యాయం చేయడం లేదని అడిగారు. 

ప్రత్యర్థుల కుట్రలపై అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. రాజీనామాలతో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి గొంతు లేకుండా పోయిందని ఆయన అన్నారు. ఎప్పటికప్పుడు తాను ఢిల్లీ పరిణామాలను గమనిస్తుంటానని కూడా ఆయన చెప్పారు.

రాష్ట్రానికి న్యాయం జరిగేలా చూడడమే తమ ఏకైక లక్ష్యమని చంద్రబాబు అన్నారు.  ఇతర పార్టీల మద్దతు కూడగట్టాలని ఆయన ఎంపీలకు సూచించారు. సస్పెండ్ చేసినా ఫరవా లేదని, వెనక్కి తగ్గవద్దని ఆయన చెప్పారు.