చంద్రబాబు వ్యూహం: పవన్ కల్యాణ్, జగన్ కార్నర్

First Published 4, Jul 2018, 2:50 PM IST
Chandrababu strategy to corner YS Jagan and Pawan
Highlights

తనపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్న వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ను, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ను కార్నర్ చేయాలనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి వ్యూహం ఫలించిందా, లేదా అనేది ప్రశ్న.

కడప: తనపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్న వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ను, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ను కార్నర్ చేయాలనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి వ్యూహం ఫలించిందా, లేదా అనేది ప్రశ్న. కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ దీక్ష ద్వారా ఆయన వారిని కార్నర్ చేయాలనే వ్యూహాన్ని ఆయన రచించి అమలు చేశారు. అదే సమయంలో బిజెపిపై మీదికి నెపాన్ని నెట్టే వ్యూహం అందులో ఇమిడి ఉంది. 

కడప ఉక్కు కర్మాగారంపై మూడు ప్రతిపాదనలు చేయడం ద్వారా చంద్రబాబు బంతిని కేంద్రం కోర్టులోకి నెట్టారనే మాట వినిపిస్తోంది.  రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కడపలో కేంద్రం ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పాలనేది మొదటి ప్రతిపాదన. కేంద్రం యాభై శాతం, రాష్ట్రం యాభై శాతం భరించే విధంగా ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు కేంద్రం సమ్మతించడం రెండో ప్రతిపాదన. లేకపోతే ఉక్కు కర్మాగారాన్ని రాష్ట్రమే స్థాపించడం మూడో ప్రతిపాదన.

ఆ మూడు ప్రతిపాదనలతో కేంద్రం వద్దకు ప్రతినిధి బృందాన్ని పంపుతామని చంద్రబాబు చెప్పారు. దీంతో వైఎస్ జగన్ గానీ పవన్ కల్యాణ్ గానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించలేని స్థితిలో పడ్డారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్రం ముందుకు రాకపోతే తామే ఉక్కు కర్మాగారాన్ని నిర్మిస్తామని చెప్పడం ద్వారా పవన్ కల్యాణ్ ను, జగన్ ను ఇరకాటంలో పెట్టినట్లు భావిస్తున్నారు. 

సిఎం రమేష్, బిటెక్ రవి దీక్ష వల్ల ప్రజల దృష్టి పవన్ కల్యాణ్, జగన్ ల వైపు నుంచి మళ్లించడానికి చంద్రబాబుకు సాధ్యమైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు జగన్ సొంత జిల్లాలో టీడీపీ ఆందోళనకు దిగడం కూడా చర్చనీయాంశంగా మారింది. జగన్ ఆత్మరక్షణలో పడేయడానికి అది ఉపయోగపడిందని అంటున్నారు. 

loader