Asianet News TeluguAsianet News Telugu

జగన్ పై చంద్రబాబు వ్యూహం ఎదురుతిరుగుతోందా?

కడప జిల్లా విభేదాలను చూస్తే వైఎస్ జగన్ ను దెబ్బ కొట్టాలనే చంద్రబాబు వ్యూహం ఎదురు తిరుగుతోందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. 

Chandrababu strategy against YS Jagan failed?

అమరావతి: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి తీసుకోవడం ద్వారా వైఎస్ జగన్ ను బలహీనపరచాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యూహ రచన చేసి అమలు చేశారు. అందులో భాగంగా దాదాపు 20 మంది ఎమ్మెల్యేలను టీడీపిలో చేర్చుకుని, వారిలో నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. 

కొత్తగా పార్టీలోకి వచ్చినవారికి, అప్పటికే పార్టీలో ఉన్నవారికి మధ్య చాలా చోట్ల సయోధ్య కుదరడం లేదు. విభేదాలు రచ్చకెక్కుతున్నాయి కూడా.  కర్నూలు జిల్లాలో మంత్రి అఖిలప్రియకు, టీడీపి నేత ఏవీ సుబ్బారెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.

తాజాగా, కడప జిల్లా విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి టీడీపిలోకి వచ్చి మంత్రి పదవి దక్కించుకున్న ఆదినారాయణ రెడ్డి వ్యవహార శైలి తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులకు మింగుడు పడడం లేదు. దీంతో తెలుగుదేశం పార్టీ నాయకులు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. 

ఆదినారాయణ రెడ్డి తీరుపై వీరశివారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఆయనపై చంద్రబాబుకు, జిల్లా ఇంచార్జీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ పై ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర దుమారం రేపుతున్నాయి. సిఎం రమేష్ వర్గానికి, ఆదినారాయణ రెడ్డికి మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. 

జమ్మలమడుగులో ఆదినారాయణ రెడ్డితో, టీడీపి ఇంచార్జీ రామసుబ్బా రెడ్డికి మధ్య ఏ మాత్రం సయోధ్య కుదరడం లేదు. చంద్రబాబు పలుమార్లు వారిని కూర్చోబెట్టి పరిష్కారం చేయడానికి ప్రయత్నించారు. తాజాగా, సోమవారంనాడు రామసుబ్బారెడ్డి ఆదినారాయణ రెడ్డిపై విరుుచకుపడ్డారు.

 రాజకీయాలు ప్రజలకు సేవ చేసేందుకే కానీ, వారిపై పెత్తనం చెలాయించేందుకు కాదని రామసుబ్బారెడ్డి ఆదినారాయణ రెడ్డిపై మండిపడ్డారు. పార్టీ పుట్టినప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డామని, అయినా ఏనాడు పార్టీ వీడలేదని ఆయన చెప్పారు. పార్టీ కోసం జైలుకు కూడా వెళ్లామని, చంద్రబాబు చెప్పడం వల్ల కొత్తగా పార్టీలోకి వచ్చినవారిని గౌరవిస్తున్నామని ఆయన అన్నారు.

 కానీ కొంత మంది ప్రకటనలు బాధ కలిగిస్తున్నాయని ఆయన ఆదిని ఉద్దేశించి అన్నారు. నాయకులను, కార్యకర్తలను విమర్శిస్తే పార్టీకే నష్టమని, తాను ఇప్పుడు వారి గురించి మట్లాడితే పార్టీకి నష్టం కలుగుతుందని ఆయన అన్నారు. మాట్లాడే రోజు వచ్చినపుడు మాట్లాడతానని చెప్పారు. 

కడప జిల్లా విభేదాలను చూస్తే వైఎస్ జగన్ ను దెబ్బ కొట్టాలనే చంద్రబాబు వ్యూహం ఎదురు తిరుగుతోందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios