అధికార వైసిపి అక్రమ మైనింగ్ మాఫియా కర్నూల్ జిల్లాలోని పవిత్రమైన రవ్వలకొండను కబళిస్తున్నారని విశ్వకర్మ, విశ్వబ్రాహ్మణ నేతలు టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేసారు. 

అమరావతి: వైసిపి నేతలు అధికార అండతో అక్రమ మైనింగ్ (illegal mining) దందా యధేచ్చగా సాగిస్తున్నారని కర్నూల్ జిల్లా (kurnool district)కు చెందిన విశ్వకర్మ, విశ్శ బ్రాహ్మణ నేతలు ఆరోపించారు. చివరకు శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములవారు కాలజ్జానం రచించిన పవిత్రమైన రవ్వల కొండ గుహను కూడా వదలడంలేదంటూ ఆందోళన వ్యక్తం చేసారు. ఈ మేరకు వైసీపీ (ysrcp) నేతలు అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నారని పలువురు విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ నేతలు టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు.

కర్నూల్ జిల్లాకు చెందిన విశ్వకర్మ, విశ్శ బ్రాహ్మణ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు (chandrababu naidu)ని కలిసారు. ఈ నాయకులతో కలిసి పోతూలూరి వీరబ్రహ్మేంద్ర స్వాములవారి చిత్రపటానికి చంద్రబాబు పూలమాల వేశారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా బనగానపల్లి మండలం రవ్వలకొండ గుహలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములవారు 450 ఏళ్ల క్రితం 12ఏళ్లు తపస్సు చేసి కాలజ్ఞానం రాశారని... అలాంటి పరమ పవిత్రమైన రవ్వలకొండను సైతం వైసీపీ అక్రమ మాఫియా ఇస్టానుసారంగా తవ్వేస్తోందని ఆందోళన వ్యక్తం చేసారు. 

రాష్ట్ర విశ్వబ్రాహ్మణ మాజీ చైర్మన్ సింహాద్రి కనకాచారి, రాష్ట్ర పౌరోహిత్య అధ్యక్షులు ఆర్యకట్ల గోవర్ధన శాస్త్రి, ఏపీ విశ్వ బ్రాహ్మణ, విశ్వ కర్మ సంఘ అధ్యక్షులు డా. చింతాడ బ్రహ్మానందరావు, రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ పరిరక్షణ సమితి అధ్యక్షులు పూలకుంట అరుణాచారి తదితరులు రవ్వలకొండ అక్రమ మైనింగ్ ను ప్రతిపక్షనేతకు వివరించారు. 

ఈ అక్రమ మైనింగ్ పై చంద్రబాబు నాయుడు స్పందిస్తూ రవ్వల కొండ అక్రమ మైనింగ్ పై పార్టీపరంగా పోరాడటం చేస్తామన్నారు. అలాగే అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాస్తానని తెలిపారు. అవసరమైతే వైసీపీ అక్రమ మైనింగ్ పై పార్టీ తరపున న్యాయపోరాటం చేస్తామన్నారు.

ఇదిలావుంటే కృష్ణా జిల్లా కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో అక్రమ మైనింగ్ జరుగుతోందంటూ టిడిపి పార్టీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే స్థానిక టిడిపి నాయకులు దేవినేని ఉమామహేశ్వర రావు మైనింగ్ ప్రాంత పరిశీలకు వెళ్లగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. మార్గమధ్యలోనే కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లోకి వెళ్లడానికి ప్రయత్నించిన టిడిపి నాయకులకు పోలీసుకు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

అయితే పోలీసులతో దేవినేని ఉమా దురుసుగా ప్రవర్తించారంటూ జి.కొండూరు పోలీసులు ఆయనపై హత్యాయత్నం, కుట్ర, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసారు. చివరకు ఆయన కోర్టును ఆశ్రయించి బెయిల్ పొందారు. ఇలా కొండపల్లి అక్రమ మైనింగ్ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. 

ఇక ఇటీవల నెల్లూరు జిల్లాలో అక్రమంగా తెల్లరాయి తవ్వకాలు జరుగుతున్నాయి. అయితే రాత్రివేళల్లో తెల్లరాయి తవ్వకాలను చేపట్టి తరలిస్తున్న అక్రమార్కులను వరికుంటపాడు మండలం ధర్మవరం గ్రామస్తులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గ్రామస్తులంతా కలిసి తవ్వకాలు చేపడుతున్న ప్రొక్లెయిన్, తరలిస్తున్న టిప్పర్ ను పట్టుకుని ధ్వంసం చేసారు. వాహనాల తాళాలు స్వాధీనం చేసుకుని ఇద్దరు డ్రైవర్లను అదుపులోకి తీసుకొని బందీగా ఉంచుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా గుర్తుతెలియని వ్యక్తులు రాత్రివేళల్లో అక్రమంగా తెల్లరాయిని తరలిస్తున్నారంటూ ధర్మవరం గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. పోలీసులు గ్రామస్తుల దగ్గరున్న ఇద్దరు డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు.