అమరావతి: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ను వైకాపా వైరస్ మించిపోయిందని ఆయన అన్నారు. కేవలం ఎనిమిది నెలల్లోనే ఏపీని చెల్లాచెదురు చేశారని ఆయన అన్నారు. 

ఆంధ్రప్రదేశ్ అంటేనే పెట్టుబడిదారులు పారిపోతున్నారని, కంపెనీలన్నీ ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన శనివారం ఆ వ్యాఖ్యలు చేశారు. 

సింగపూర్ కన్సార్టియం, కియా అనుబంధ సంస్థలు, ఫ్రాంక్లిన్ పెంపుల్టన్, ఆసియా పేపర్ అండద్ పల్ప్, రిలయన్స్... అన్నీ ఎనిమిది నెలల్లోనే క్యూ కట్టాయని ఆయన అన్నారు .ఇది చాలదన్నట్లుగా అమరావతిలో సచివాలయంలో ఉండగా విశాఖలో మిలీనియం టవర్ లోని కంపెనీలను తరిమేసి అక్కడ కూర్చుకుంటారట అని ఆయన అన్నారు. 

ఒక కంపెనీని తెచ్చే సమర్థత లేదని, యువతకు గౌరవప్రదమైన ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వడం చేతకాదని, అలాంటి వైకాపాకు విశాఖలో లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్న 18 వేల మంది ఉద్యోగాలకు ముప్పు తెచ్చే హక్కు ఎవరిచ్చారని ఆయన అన్నారు. సొంతంగా ఒక భవనం కూడా కట్టుకోలేని మీరు ఉత్తరాంధ్రను ఉద్ధరిస్తారా అని చంద్రబాబు ప్రశ్నించారు.