‘రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ లేదు’..ఇది చంద్రబాబునాయుడు మిత్రపక్షం గురించి చేసిన వ్యాఖ్యలు. చూడబోతే వచ్చే ఎన్నికల్లో బిజెపితో పొత్తులు అవసరం లేదదని అనుకుంటున్నట్లున్నారు. అందుకనే బిజెపి ఉనికిపై అంత సూటిగా మాట్లాడారు. రాష్ట్రంలో బిజెపి, కాంగ్రెస్ లు లేవని చెప్పటం చూస్తుంటే చంద్రబాబు మనసులోని ఆలోచనేంటో అర్ధమవుతోంది.

కాంగ్రెస్ పార్టీ లేదంటే అర్ధం చేసుకోవచ్చు. కానీ బిజెపి కూడా లేదంటే ఎలా? నిజానికి బిజెపికి రాష్ట్రంలో బలం ఎప్పుడూ లేదన్నది వాస్తవమే. అయితే పోయిన ఎన్నికల్లో బిజెపి వెంటపడి మరీ పొత్తు పెట్టుకున్నది ఎవరు? చంద్రబాబే కదా? పోయిన ఎన్నికల్లో అంతలా వెంటపడి పొత్తులు పెట్టుకుని ఇపుడు బిజెపి రాష్ట్రంలో లేదని చెప్పటంలో అర్ధమేంటి?

అంటే, వచ్చే ఎన్నికల్లో బిజెపితో పొత్తులు అవసరం లేదని చంద్రబాబు మానసికంగా సిద్దపడినట్లు అర్ధమవుతోంది. అందుకనే అంత ధైర్యంగా బిజెపిపై వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు తమ పార్టీ బలోపేతమైందని వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ కీలకపాత్ర పోషిస్తుందని బిజెపి నేతలు పదే పదే చెబుతున్నారు.

సరే, వారి ప్రకటనల్లో ఏమాత్రం నిజముందో వచ్చే ఎన్నికల్లో తేలిపోతుంది. ఎటుతిరిగి వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని బిజెపిలోని కొందరు నేతలు ఎప్పటి నుండో చెబుతున్న విషయం అందరికీ తెలిసిందే. దాన్ని అవకాశంగా తీసుకుని చంద్రబాబు కూడా వారంతట వారే పొత్తు నుండి వెళ్ళిపోవాలని వ్యూహం పన్నుతున్నారేమో?