పెట్టుబడుల ఒప్పందాలు తగ్గటానికి చంద్రబాబునాయుడు బ్రహ్మాండమైన కారణం చెప్పారు. విశాఖపట్నంలో మూడు రోజుల పాటు జరిగిన పెట్టుబడుల సదస్సులో రూ. 4.39 లక్షల కోట్ల విలువైన ఎంవోయులు జరిగాయి. పోయిన సంవత్సరం రూ. 10 లక్షల కోట్ల విలువైన ఎంవోయులు జరినట్లు అప్పట్లో చంద్రబాబు ఎంతో ఆర్భాటంగా ప్రకటించారు. సరే, లక్షల కోట్ల విలువైన ఎంవోయులు ఎందుకు తగ్గిపోయాయని ఎవరూ అడక్కూడదు. చంద్రన్నకు కోపం వస్తుంది.

దాదాపు నెల తర్వాత మంగళవారం రాత్రి మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ, కొందరు పెట్టుబడిదారులు ఏపిలో పెట్టుబడులు పెట్టటానికి భయపడుతున్నట్లు చెప్పారు. ఎందుకయ్యా అంటే? గతంలో పెట్టుబడులు పెట్టిన వారిలో కొందరిని, అఖిల భారత సర్వీసు అధికారులపై పెట్టిన కేసులు, జైళ్ళను ప్రస్తావించారట. ‘మీరు సిఎంగా ఉన్నపుడు బాగుండేది..మీ తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన వారు పారిశ్రామికవేత్తలపైన, ఉన్నతాధికారులపైన కేసులు పెట్టి జైళ్ళకు పంపారని చంద్రబాబుతో చెప్పారట.

పారిశ్రామికవేత్తల ఆందోళనతో ఏపి బ్రాండ్ ఏ స్ధాయిలో దెబ్బతిందో అందరూ గమనించాలని చంద్రబాబు తెగ బాధపడిపోయారు. అప్పట్లో జరిగినట్లు మళ్ళీ జరక్కుండా తాను అన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు భరోసా ఇచ్చారట. తనను చూసి ప్రభుత్వాన్ని చూసి పెట్టుబడులు వస్తున్నట్లు చెప్పారు.

చంద్రబాబు చెప్పిందాన్ని పక్కనపెడితే, అసలు జగన్ పై కేసులు పెట్టిందెవరు? ఎప్పుడు కేసులు పెట్టారు? కాంగ్రెస్ లో ఉన్నంత కాలం జగన్ పై ఏ కేసు లేదుకదా? కాంగ్రెస్ నుండి బయటకు వచ్చేసిన తర్వాత కాంగ్రెస్ నేతలు హై కోర్టులో కేసు వేశారు. కాంగ్రెస్ నేత శంకర్ రావు వేసిన కేసులో టిడిపి నేత యర్రన్నాయడు కూడా ఇంప్లీడ్ అయ్యారు కదా? అంటే జగన్ పై ఉన్న కేసులకు కాంగ్రెస్, టిడిపిలే కారణమని తెలుస్తోంది.

జగన్ ను ఇరికిద్దామని కాంగ్రెస్, టిడిపిలు వేసిన కేసుల్లోనే పలువురు పారిశ్రామికవేత్తలు, ఐఏఎస్ అధికారులు కూడా ఇరుక్కున్నారు. అందుకు జగన్  ఏ విధంగా కారణమవుతారు? సరే, ప్రస్తుతానికి వస్తే జగన్ పై ఉన్న కేసుల్లో ఒక్కటి కూడా ప్రూవ్ కాలేదు. పైగా కేసుల్లో పారిశ్రామికవేత్తలు, ఐఏఎస్ ల పాత్ర లేదని కేసులను కొట్టేస్తున్నారు కూడా. వాస్తవాలు ఇలావుండగా పెట్టుబడిదారులు జగన్ చూసి భయపడుతున్నారన్నట్లు చెప్పటంలో బట్టకాల్చి జగన్ మొహంపై మీదేసయటమే.