హైదరాబాద్: కరోనా వ్యాప్తి కట్టడికి తీసుకునే చర్యల విషయంలో తాను ప్రధాని నరేంద్ర మోడీకి విలువైన సలహాలు, సూచనలు ఇచ్చానని తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మోడీ తనకు ఈ రోజు ఉదయం ఫోన్ చేశారని, తాను మోడీకి సలహాలూ సూచనలూ చేశానని ఆయన చెప్పారు. 

కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై మోడీ అందరినీ కలుపుకుని పోతున్నారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలు సరిగా లేవని ఆయన అన్నారు. మోడీ తీసుకుంటున్న చర్యలను ఆయన ప్రశంసించారు. లాక్ డౌన్ పొడగింపును ఆయన సమర్థించారు. ఆయన మంగళవారం హైదరాబాదులో మీడియాతో మాట్లాడారు.

కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై తాను ప్రధానికి ఇటీవల ఓ లేఖ రాశానని, ఆ లేఖలో తాను సూచనలు చేశానని ఆయన చెప్పారు. నిన్న ప్రధాని కార్యాలయానికి తాను ఫోన్ చేశానని, ఆనయయతో మాట్లాడాలని ఆడిగానని, ఈ రోజు ఉదయం 8.30 గంటలకు ప్రధాని తనకు ఫోన్ చేశారని, మోడీతో తన ఆలోచనలను పంచుకున్నానని చంద్రబాబు చెప్పారు.

కంటికి కనిపించని శత్రువైన కరోనాను లాక్ డౌన్ తో కట్టడి చేయగలుగుతున్నట్లు ఆయన తెలిపారు. ఆర్థిక వ్యవస్థకు ఇదో పెద్ద సవాల్ గా మారింనది, ఈ సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడడం ముఖ్యమని ఆయన అన్నారు. కొన్ని చోట్ల ప్రజలు కష్టాలు పడుతున్నారని ఆయన చెప్పారు.