విజయనగరం: దేశాన్ని కాపాడడానికి, ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి కాంగ్రెసుతో కలిసి పనిచేయాలని తానే ప్రతిపాదించానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే కాంగ్రెసుతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు. విజయనగరం ధర్మ పోరాట సభలో ఆయన మంగళవారం సాయంత్రం ప్రసంగించారు. బిజెపికి వ్యతిరేకంగా అన్ని పార్టీలను ఒకే వేదిక మీదికి తేవడానికి తాను ఇతర పార్టీల నాయకులను కలిశానని, అది ఫలితం ఇస్తోందని ఆయన అన్నారు. 

కోడి కత్తి డ్రామా ఆడిన వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తప్పించుకుని తిరుగుతున్నారని చంద్రబాబు అన్నారు. ప్రధాని మోడీని చూస్తే జగన్ కు వణుకు పుడుతుందని ఆయన అన్నారు. న్యాయం కోసం, ధర్మం కోసం పోరాటం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 

కేంద్రాన్ని ప్రశ్నిస్తే ఈడిని రెచ్చగొట్టి దాడులు చేయిస్తోందని ఆయన అన్నారు. పార్లమెంటు సభ్యులను బెదిరించి ఈడి, సిబిఐ దాడులు చేయిస్తోందని, ఈడీ దాడులకు భయపడేది లేదని అన్నారు. 

తెలుగు ప్రజలకు గుర్తింపు తేవడానికి తాను హైదరాబాదును అభివృద్ధి చేశానని ఆయన చెప్పారు. గవర్నర్ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని, మన మీదికి కూడా గవర్నర్ ను రెచ్చగొడుతోందని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు ఇస్తామన్నవేవీ కేంద్రం ఇవ్వలేదని ఆయన అన్నారు. అహ్మదాబాద్ నుంచి ఢిల్లీకి బుల్లెట్ ట్రైన్ వేసుకున్నారు గానీ అమరావతి నిర్మాణానికి తగిన నిధులు ఇవ్వడం లేదని అన్నారు. 

అమరావతిని ఢిల్లీకన్నా మిన్నగా అభివృద్ధి చేస్తామని ప్రధాని హామీ ఇచ్చారని, కానీ దాన్ని అమలు చేయడం లేదని ఆయన అన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి ఒక్క సమావేశం కూడా పెట్టలేదని అన్నారు. చివరి బడ్జెట్ లో కూడా కేంద్రం ఎపికి మొండిచేయి చూపిందని అన్నారు. ఇప్పటికి కూడా ఎపి బాధ కేంద్రానికి అర్థం కావడం లేదు. 

విశాఖకు రైల్వే జోన్ కోసం మీనమేషాలు లెక్కిస్తున్నారని, విశాఖకు రైల్వే జోన్ వచ్చే వరకు పోరాటం చేస్తానని ఆయన చెప్పారు. నోట్ల రద్దు ఫార్స్ గా తయారైందని అన్నారు. ఎటిఎంల్లో డబ్బులు ఉండడం లేదని అన్నారు. మోడీ కన్నా ముందే తాను ముఖ్యమంత్రి అయ్యానని ఆయన అన్నారు. దేశంలో తానే సీనియర్ నాయకుడినని అన్నారు. 

పోలవరం, పట్టిసీమ, అమరావతిలకు ప్రతిపక్షం అడ్డు పడిందని ఆయన అన్నారు. మోడీ ప్రభుత్వంపై అవిశ్వాసం విషయంలో వైసిపిని బలపరిస్తే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్లు ఉంటుందని, అందుకే తామే అవిశ్వాస తీర్మానం పెట్టామని అన్నారు.