నేడు గాలి, రేపు వైఎస్ జగన్: బిజెపిపై చంద్రబాబు డౌట్

నేడు గాలి, రేపు వైఎస్ జగన్: బిజెపిపై చంద్రబాబు డౌట్

అమరావతి: కర్ణాటకలో ప్రస్తుతం గాలి జనార్దనరెడ్డిపై ఉన్న కేసులను బలహీనపరిచే ప్రక్రియ మొదలైందని, వారికి సహకరిస్తున్నందుకు రేపు వైఎస్‌ జగన్‌ కేసులను కూడా బలహీనపరచడం ప్రారంభిస్తారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బిజెపిపై వ్యాఖ్యానించారు. కొన్ని పార్టీలకు రాజకీయ ప్రయోజనాలు తప్ప సిద్ధాంతాల్లేవని అన్నారు.

తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహణ కోసం ఏర్పాటైన 16 కమిటీల సభ్యులతో ఆయన శుక్రవారం సాయంత్రం సమావేశమయ్యారు. ఆ సమావేశంలో ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. నమ్మక ద్రోహాన్ని కుట్ర రాజకీయాలను మహానాడు వేదికగా ఎండగట్టాలని పిలుపిచ్చారు. 

రాష్ట్రంలో విధ్వంసాలు సృష్టించడానికి ఒక పథకం ప్రకారం కుట్రలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ఇటీవల గుంటూరులో పనిగట్టుకుని విధ్వంసం సృష్టించారని, ఒక చిన్నారిపై జరిగిన అఘాయత్యాన్ని అడ్డం పెట్టుకొని విధ్వంసానికి ప్రణాళిక రచించారని ఆయన అన్నారు. 

అంతకు ముందు తిరుపతిలో కూడా అటువంటి ప్రయత్నమే జరిగిందని, ఆ తర్వాత తిరుమల పవిత్ర క్షేత్రంపై రమణ దీక్షితులు ద్వారా బురద చల్లించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.  మరో పది అటువంటి కుట్రలకే ప్రణాళికలు వేస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని చిత్రించడం ద్వారా మన ప్రభుత్వాన్ని ప్రజలకు దూరం చేయాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు.

 గుంటూరు విధ్వంసం పథకం ప్రకారమే జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారని తెలిపారు. దీనిపై లోతైన విచారణ జరుగుతోందని చెప్పారు. 3000 మంది ఎలా వచ్చారో, 87 వాహనాలు రాత్రికి రాత్రి ఎలా వచ్చాయో ఆరా తీస్తున్నట్లు చెప్పారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Andhra Pradesh

Next page