ప్రత్యేక హోదాపై చంద్రబాబు మౌనం... ఎందుకో..?
ఏపీలో ప్రత్యేక హోదా అంశం మళ్లీ తెరపైకి వస్తోంది. తాజాగా పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి ప్రత్యేక హోదా గురించి ప్రశ్నలు లేవనెత్తారు. మోడీ సర్కార్ లో కింగ్ మేకర్ గా ఉన్న చంద్రబాబు... హోదాపై ఎందుకు మౌనం వహిస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక హోదా అంశం మెల్లగా తెరపైకి వస్తోంది. ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేకమార్లు ఈ అంశాన్ని లేవనెత్తారు. కేంద్రంలో కింగ్ మేకర్ చంద్రబాబు రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ చేయాలని ఒత్తిడి చేశారు. వైసీపీకే ఇలాంటి అవకాశం వస్తే తప్పకుండా కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధించుకునేవారిమని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో పార్లమెంటులోనూ వైసీపీ ఎంపీలు ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తుతున్నారు. పదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రత్యేక హోదా కోరుతున్నారని... తాము కూడా అడుగుతూనే ఉన్నామని వైసీపీ పార్లమెంటు సభ్యులు సభలో ప్రస్తావించారు. కేంద్రంలో కీలకంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదా సాధించాలని డిమాండ్ చేశారు.
తాజాగా పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి ప్రత్యేక హోదా గురించి ప్రశ్నలు లేవనెత్తారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి అధికారమిస్తే.. పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారు. అయినప్పటికీ ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఒక్క అసెంబ్లీ/పార్లమెంటు సీటును కాంగ్రెస్‌కి ఇవ్వలేదు. ఈ తరుణంలో షర్మిల చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.
‘‘బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని నితీష్ తీర్మానం చేసి మోడీ ముందట డిమాండ్ పెడితే.. ఏపీకి హోదాపై చంద్రబాబు గారు కనీసం నోరు విప్పడం లేదు. మోడీ సర్కార్ లో కింగ్ మేకర్ గా ఉన్న మీరు.. హోదాపై ఎందుకు మౌనం వహిస్తున్నారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. రాజధాని లేని రాష్ట్రంగా బీహార్ కంటే వెనకబడి ఉన్నామని మీకు తెలియదా? 15 ఏళ్లు హోదా కావాలని అడిగిన రోజులు మీకు గుర్తులేదా? రాష్ట్ర అభివృద్ధిలో ఏపీ 20 ఏళ్లు వెనకబడిందని చెప్పింది మీరే కదా? హోదా ఇవ్వకుంటే మద్దతు ఉపసంహరణ అని ఎందుకు అడగడం లేదు? మోసం చేసిన మోడీతో హోదాపై సంతకం ఎందుకు పెట్టించలేరు? ప్రత్యేక హోదాపై మీ వైఖరి ఏంటో చెప్పాలని, రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రం దగ్గర హోదా డిమాండ్ పెట్టాలని, చంద్రబాబు గారిని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ప్రత్యేక ప్యాకేజీలు కాదు. రాష్ట్ర అభివృద్ధికి హోదా ఒక్కటే మార్గమని అని గుర్తు చేస్తున్నాం’’ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు.