అమరావతి: రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 11వ తేదీన దేశరాజధాని ఢిల్లీలో దీక్ష చేపట్టనున్న విషయం తెలిసిందే. ఈ దీక్ష ఖర్చు రూ. 2 కోట్లు అని తెలుస్తోంది.

దీక్ష ఏర్పాట్ల కోసం రూ.2 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 1,12,16465 రూపాయలను విడుదల చేశారు. ఇందులో ముఖ్యమంత్రి హెలికాప్టర్ చార్జీలను చేర్చలేదు. 

చంద్రబాబు దీక్షకు ప్రజలను ఢిల్లీకి తరలించడానికి ప్రభుత్వం రెండు రైళ్లలో 20 బోగీల చొప్పున అద్దెకు తీసుకుంది. వీటిలో ఓ రైలు అనంతపురం నుంచి ప్రారంభమవుతుండగా, మరో రైలుడు శ్రీకాకుళం నుంచి బయలుదేరుతుంది. ఈ రైళ్లు ఈ నెల 10వ తేదీకి ఢిల్లీ చేరుకుంటాయి. 

శ్రీకాకుళం నుంచి బయలుదేరుతున్న రైలుకు రూ.59,49,380 ఖర్చు పెడుతుండగా, అనంతపురం నుంచి బయలుదేరుతున్న రైలుకు రూ.42,67,085 చెల్లిస్తున్నారు. బోగీలకు 10 లక్షల రూపాయలకు డిపాజిట్ చేస్తున్నారు .మొత్తం ఖర్చు రూ.1,12,16,465 అవుతుంది.