చంద్రబాబుకు రిమాండ్: స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్న రోజా (వీడియో)
టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎసిబి కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో మంత్రి, వైసిపి నాయకురాలు రోజా సంబరాలు చేసుకున్నారు. స్వీట్లు పంపిణీ చేశారు.

విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఎసిబి కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించిన నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కొంత మంది మంత్రులు సంబరాలు చేసుకుంటున్నారు. మంత్రి రోజా స్వీట్లు పంచారు. చంద్రబాబుకు ఆరంభం మాత్రమేనని, అంతం కాదని ఆమె అన్నారు. పైనుంచి దేవుడు చూస్తున్నాడు, చంద్రబాబుకు శిక్ష వేస్తాడు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెబుతూ వచ్చారని ఆయన అన్నారు.
చంద్రబాబు ఎంతో మంది ఉసురు పోసుకున్నాడని, అందరి జీవితాలతో చెడుగుడు ఆడుకున్నాడని ఆమె అన్నారు. ఇంకా మరిన్ని కేసుల్లో చంద్రబాబు జీవితాంతం జైలులో చిప్ప కూడు తింటాడని రోజా అన్నారు. సరైన సమయంలో దేవుడు చంద్రబాబు పాపాలకు శిక్ష వేశాడని ఆమె అన్నారు. సరైన సమయంలో సరైన శిక్ష వేశాడని ఆమె అన్నారు.
చంద్రబాబుకు స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో పదేళ్లు జైలు శిక్ష పడుతుందని వైసిపి ఎంపి విజయసాయి రెడ్డి అన్నారు. స్కిల్ డెవలప్ మెంటు కేసు మాత్రమే కాదు, మరో ఆరేడు కేసులున్నాయని అన్నారు. చంద్రబాబు చట్టాలను అతిక్రమించాడని ఆయన అన్నారు. విదేశాలకు నగదును, ఆస్తులను తరలించి దాచుకున్నారని ఆయన అన్నారు. కచ్చితమైన ఆధారాలతో చంద్రబాబుపై కేసు నమోదు చేశారని ఆయన అన్నారు.
చంద్రబాబుకు కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంపై మరో మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. కోట్ల రూపాయలిచ్చి తెచ్చిన లూథ్రా పొన్నవోలు ముందు బలాదూర్ అని ఆయన ట్వీట్ చేశారు.