నెల్లూరు జిల్లాలో టూరిజం శాఖలో పనిచేసే మహిళా ఉద్యోగిపై ఉన్నతాధికారి దాడి చేయడాన్ని మాజీ సీఎం, టిడిపి అధ్యక్షులు చంద్రబాబు ఖండించారు.  మాస్క్ వేసుకోకుండా కార్యాలయానికి రావడంపై ప్రశ్నించిన తోటి మహిళా ఉద్యోగిపై పర్యాటక శాఖ అధికారి దాడి చేయడం దారుణమన్నారు. మంచి చెప్పిన వికలాంగురాలిపై అధికారి దాడి అమానుషమని... మాస్క్ తప్పనిసరిగా ధరించాలనేది కోవిడ్ నామ్స్ లో ప్రాధానాంశమని చంద్రబాబు గుర్తుచేశారు. 

''మాస్క్ లేనందుకు అనేకచోట్ల జరిమానాలు విధించడం తెలిసిందే. దీనిపై ప్రధాని నరేంద్ర మోది అనేకమార్లు చెప్పారు. మాస్క్ పెట్టుకోనందుకు ఒక దేశ ప్రధానికి రూ13వేలు జరిమానా విధించారని కూడా నరేంద్ర మోది గుర్తు చేశారు. అలాంటిది ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగాని, మంత్రులుగాని మాస్క్ లు ధరించకుండా ఏ సంకేతాలు ప్రజలకు ఇస్తున్నారు..? పాలకులే సరైన సంకేతాలు ప్రజలకు ఇవ్వక పోవడం గర్హనీయం'' అని మండిపడ్డారు. 

''అందుకే ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయి.‘‘యథారాజా తథా ప్రజా’’ అన్నది అందుకే. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ పాలకులు సక్రమ ప్రవర్తన ద్వారా అధికారులకు, ప్రజలకు సరైన మార్గదర్శకం చేయాలని, ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చూస్తారని ఆశిస్తున్నాను'' అని చంద్రబాబు అన్నారు.  

read more  నెల్లూరులో అసిస్టెంట్ పై దాడి.. మేనేజర్ భాస్కర్ రావు అరెస్ట్.. సస్పెన్షన్.. (వీడియో)

అయితే ఇప్పటికే మాస్కు పెట్టుకోవాలని చెప్పినందుకు మహిళా ఉద్యోగినిపై విచక్షణ రహితంగా కొట్టిన ఏపీ టూరిజం డిప్యూటీ మేనేజర్ భాస్కర్ ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఏపీ టూరిజం కార్యాలయంలో  డిప్యూటీ మేనేజర్ గా  పనిచేస్తున్న భాస్కర్ కాంట్రాక్టు ఉద్యోగిని ఉషారాణిపై విచక్షణ రహితంగా దాడికి దిగిన విషయం తెలిసిందే.

 ఈ ఘటన ఈ నెల 27వ  తేదీన చోటుచేసుకున్నా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కార్యాలయంలోని సీసీటీవీ పుటేజీలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడ పట్టించుకోలేదని బాధితురాలు ఆరోపించారు. 

ఈ విషయమై మంగళవారం మీడియాలో కథనాలు రావడంతో పోలీసులు చర్యలు తీసుకొన్నారు. మీడియాలో వచ్చిన కథనాలపై ఏపీ టూరిజం మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందించారు. బాధితురాలితో మంత్రి స్వయంగా ఫోన్ లో మాట్లాడారు. నిందితుడిని ఉద్యోగం నుండి తొలగిస్తామని మంత్రి హామీ ఇచ్చారని బాధితురాలు మీడియాకు తెలిపారు.