గుంటూరు: కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న విద్యా సంస్కణలపై ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు స్పందించారు. కేబినెట్ ఆమోదించిన కేంద్ర విద్యా విధానం 2020ని స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు.  

 

''ప్రధాని నరేంద్ర మోదీ గారి సారథ్యంలోని కేంద్ర కేబినెట్ ఆమోదించిన కేంద్ర విద్యా విధానం 2020ని స్వాగతిస్తున్నాను. ఈ సంస్కరణలు విద్యా రంగంలో సమూల మార్పులను తీసుకురావడంతో పాటు మన యువతను ప్రపంచంతో పోటీ పడే విధంగా తయారు చేస్తుందని నమ్ముతున్నాను'' అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. 

 

''5వ తరగతి వరకూ మాతృభాష, ప్రాంతీయ భాష, స్థానిక భాషలో విద్యా బోధన ఉండాలని ఈ పాలసీ సూచించడం స్వాగతించదగ్గ విషయం. ఇది విద్యార్ధుల్లో  ఆలోచన శక్తిని, అక్షరాస్యత స్కిల్స్ ని పెంచి విద్యా ప్రమాణాలను పెంచడంతో తోడ్పడుతుంది'' అని చంద్రబాబు పేర్కొన్నారు.

read more   మీ సంస్కరణలు దేశానికి... కరోనా చర్యలు బ్రిటన్ కే ఆదర్శం: సజ్జలకు అయ్యన్న కౌంటర్

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త విద్యావిధానం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇరకాటంలో పెట్టేలా కనిపిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలనే వైఎస్ జగన్ నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వ విద్యా విధానం విఘాతం కలిగించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం దాదాపు 34 ఏళ్ల తర్వాత కొత్త విద్యావిధానాన్ని తీసుకొచ్చింది.

5వ తరగతి వరకు మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని కేంద్రం నిర్ణయించింది. వీలైతే 8వ తరగతి వరకు కూడా మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని చెప్పింది. తెలుగు మీడియం ఆప్షన్ లేకుండా ఇంగ్లీష్ మీడియంను పాఠశాలల్లో ప్రవేశపెట్టాలనే జగన్ నిర్ణయానికి ఇది ఆటంకం కలిగించే అవకాశం ఉంది. 

కేంద్రం తెచ్చిన జాతీయ విద్యావిధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పాటించాల్సి ఉంటుందని అంటున్నారు. ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉండాలనే జగన్ నిర్ణయానికి అది విఘాతం కలిగిస్తుందని అంటున్నారు. ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 81,85 జీవోలను హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పును జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. 

రాష్ట్రంలోని 80 శాతానికి పైగా విద్యార్థుల తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియాన్ని కోరుకుంటున్నారని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.