విశాఖపట్నం: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విద్యా సంస్కరణలు జగన్ ప్రభుత్వం తీసుకున్న సంస్కరణలను పోలి వున్నాయన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు స్పందించారు. సంస్కరణలంటే కేవలం గోడలకు రంగులు వెయ్యడం కాదంటూ సోషల్ మీడియా వేదికన కౌంటర్ ఇచ్చారు. 

''వైఎస్ జగన్ గారు తెచ్చిన మార్పు చూసే కేంద్ర ప్రభుత్వం విద్యా రంగంలో సంస్కరణలు తీసుకొచ్చింది అని సజ్జల రామకృష్ణా రెడ్డి గారు అంటున్నారు. అది ఎలా ఉందంటే " మేము తీసుకున్న కరోనా చర్యలు, బ్రిటన్ దేశానికి ఆదర్శం" అని డప్పు కొట్టుకున్నట్టే ఉంది'' అంటూ  ట్విట్టర్ వేదికన అయ్యన్న ఎద్దేవా చేశారు.  

''గతంలో చంద్రబాబు గారి హయంలో చేసిన పనులు ఇవి. డిజిటల్ క్లాస్ రూమ్స్, వర్చ్యువల్ క్లాస్ రూమ్స్, పిల్లలకు స్కూల్ యినిఫాం, మునిసిపల్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం,ప్రైవేట్ స్కూల్స్ తో పోటీ పడే విధంగా అంగన్వాడీ స్కూల్స్ అభివృద్ధిబాలికలకు సైకిళ్లు, మధ్యాహ్న భోజనం, ప్రాజెక్ట్ గాండీవ, పాంచజన్య ప్రాజెక్టు, 33,145 అదనపు తరగతి గదుల నిర్మాణం, 40,665 పాఠశాలల్లో మరుగుదొడ్లు, ఫర్నీచరు సదుపాయం, బాలికలకు శానిటరీ న్యాప్‌కిన్ల సరఫరా లాంటి ఎన్నో కార్యక్రమాలు చేసారు'' అని గుర్తుచేశారు. 

read more   ఏపీ సీఎం వైఎస్ జగన్ సర్కార్ మీద కేంద్రం దెబ్బ

''నాడు-నేడు అంటూ రంగులు వెయ్యటం తప్ప, మీరు ఈ 14 నెలలలో విద్యా రంగానికి ఏమి చేసారో చెప్పగలరా సజ్జల రెడ్డి గారు? సంస్కరణలు అంటే రంగులు వెయ్యడమా?మీ జగన్ రెడ్డి తీసుకొచ్చిన ఒక్క సంస్కరణ చెప్పండి?  అయినా కేంద్రం 8వ తరగతి వరకు,మాతృభాషలో విద్యాభ్యాసం అంటుంటే దాని గురించి మాట్లాడే ధైర్యం ఎందుకు రాలేదో?'' '' అంటూ అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. 

అంతకుముందు సజ్జల ''విద్యారంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త విధాననిర్ణయాల్లో గత ఏడాది కాలంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలన్నీ కనిపిస్తున్నాయి. ఉపాధి, ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పాఠ్యప్రణాళికలో సీఎం వైఎస్ జగన్ గారు తీసుకొచ్చిన మార్పులు దీంట్లో ప్రధానంగా కనిపించాయి'' అంటూ ట్వీట్ చేశారు. 

''ప్రి ప్రైమరీ, పాఠశాల స్థాయి నుంచే నైపుణ్యాభివృద్ధితోపాటు,ప్రపంచస్థాయి పోటీని తట్టుకునేలా విద్యార్థుల్లో విశ్లేషణాత్మక,శాస్త్రీయ దృక్పథాలను పెంచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలన్నీ కూడా ఇవ్వాళ్టి కేంద్రం నిర్ణయాల్లో ప్రస్ఫుటంగా కనిపించడం సీఎంగారి విజన్‌కు నిదర్శనం'' అంటూ  సజ్జల చేసిన కామెంట్స్ పై అయ్యన్న ఘాటుగా స్పందించారు.