అమరావతి: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు భేటీపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. తెలంగాణ పోలీసులకు షర్మిల చేసిన ఫిర్యాదుపైనా ఆయన మాట్లాడారు.

తెలుగుదేశం పార్టీ నేతలతో  చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేటీఆర్, జగన్ మధ్య భేటీ హడావిడిగా జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ భేటీతో టీఆర్ఎస్, వైసిపిల ముసుగు తొలగిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదనకు స్పందన లేదని ఆయన అన్నారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణకు కూడా ఇవ్వాలంటూ కేసీఆర్ అడ్డం పడ్డారని ఆయన వ్యాఖ్యానించారు. ఎపికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేసీఆర్ అడ్డం పడరా అని ఆయన అడిగారు. 9, 10 షెడ్యూల్ లోని సంస్థల విభజన జరగుకుండా కేసీఆర్ అడ్డుపడ్డారని ఆయన అన్నారు. 

చివరకు సుప్రీంకోర్టు తీర్పు కూడా అమలు కాకుండా కేసీఆర్ చూశారని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని కేసీఆర్ చెప్పగలరా అని నిలదీశారు. బిజెపి వ్యతిరేక ఓట్లను చీల్చాలని కుట్రలు చేస్తున్నారని, బిజెపి వ్యతిరేక శక్తులు ఏకం కాకుండా కుతంత్రాలు చేస్తున్నారని ఆయన కేసీఆర్ మీద మండిపడ్డారు. 

ఎపిపై గద్దల్లా వాలుతున్నారని, కులాల చిచ్చు పెడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ మీద దర్యాప్తు జరగకుండా కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బిజెపి ఎజెండాను అమలు చేయడమే టీఆర్ఎస్, వైసిపి లక్ష్యమని ఆయన అన్నారు. ప్రజల్లో అయోమయం సృష్టించడం వారి ఉద్దేశ్యమని అన్నారు. 

తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని తమ టీడిపీపై వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల ఫిర్యాదు చేయడం దురదృష్టకరమని చంద్రబాబు అన్నారు. సోషల్ మీడియాలో అసభ్య ప్రచారం చేసింది వైసిపినే అని ఆయన అన్నారు. టీడీపీ మహిళా నేతలపై వైసిపి సోషల్ మీడియాలో అసభ్య ప్రచారం చేసిందని ఆయన అన్నారు. 

తన కుటుంబ సభ్యుల మీద కూడా దుష్ప్రచారం చేసిందని ఆయన అన్నారు. సోషల్ మీడియాను ఎవరు దుర్వినియోగం చేసినా సహించేది లేదని ఆయన అన్నారు. సోషల్ మీడియాలో హద్దులు దాటితే కఠిన చర్యలు ఉంటాయని చంద్రబాబు హెచ్చరించారు. పవన్ కల్యాణ్ పెళ్లిళ్లపై కూడా దుష్ప్రచారం చేశారని ఆయన అన్నారు.