గుంటూరు: ఆంఫన్ తుఫాన్ ఒడిషా, బెంగాల్ లో బీభత్సం సృష్టించింది. ఈ తుఫాను ప్రభావంతో వీచిన ఈదురు గాలులు, కురిసిన వర్షాల కారణంగా ఇరురాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయాయి. కేవలం ఆస్తి నష్టమే కాకుండా ప్రాణనష్టం కూడా చోటుచేసుకుంది. తుఫాను సృష్టించిన ఈ భయానక పరిస్థితుల గురించి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికన స్పందించారు. ఈ తుఫాను బీభత్సం విచారకరమని...భాదిత ప్రజలు త్వరగా కోలుకోవాలనే ఆకాంక్షిస్తుననట్లు చంద్రబాబు పేర్కొన్నారు. 

''ఆంఫన్ బీభత్సంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు అస్తవ్యస్తం అయ్యాయి. అనేక జిల్లాలలో అంపన్ సృష్టించిన విధ్వంసం కలిచివేసింది. ఎంతోమంది చనిపోయారు, నిరాశ్రయులు అయ్యారు. అంపన్ లో కూడా ఈదురుగాలులు వందల కిమీ వేగంతో బీభత్సం సృష్టించాయి. వేలాది విద్యుత్ స్థంభాలు, చెట్లు నేలకూలాయి. కుంభవృష్టితో జనజీవనం అస్తవ్యస్తం అయ్యింది'' అని అన్నారు. 

''గతంలో హుద్ హుద్ తుపాన్ లో 250కిమీ వేగంతో ఈదురుగాలుల విశాఖలో బీభత్సం తెలిసిందే. విశాఖ ప్రజానీకం మొక్కవోని ధైర్యంతో హుద్ హుద్ విపత్తు నష్టాన్ని అధిగమించారు. ఇప్పుడీ అంపన్ బీభత్సం నుంచి కూడా 2రాష్ట్రాలు త్వరితగతిన తేరుకోవాలి'' అని కోరారు. 

''కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి బాధితులకు సహాయ, పునరావాస చర్యలు హుటాహుటిన చేపట్టాలి. ఆంఫన్ బీభత్సం నుంచి రెండు రాష్ట్రాలు త్వరగా కోలుకోవాలని, జన జీవన పరిస్థితులు వీలైనంత తొందరలో చక్కబడాలని ఆశిద్దాం'' అంటూ చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. 

ఈ ఆంఫన్ తుఫాన్ కారణంగా ఒక్క బెంగాల్ లోనే 78మంది ప్రాణాలు కోల్పోయారు. గత వందేళ్లలో ఆ రాష్ట్రాన్ని తాకిన అత్యంత తీవ్రమైన తుఫాన్‌ ఇదే కావడం గమనార్హం. తుఫాను సృష్టించిన విలయానికి జనం వణికిపోయారు. భారీవర్షాలు, పెనుగాలులకు వేలాదిగా ఇళ్లు నేల మట్టమయ్యాయి. విద్యుత్‌ స్తంభాలు విరిగి పడటంతో అరడజను జిల్లాల్లో కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఒక్క కోల్‌కతాలోనే 14లక్షల మందికి పైగా అంధకారంలో మగ్గిపోతున్నారు.

1,500కు పైగా సెల్‌ టవర్లు ధ్వంసం కావడంతో మొబైల్‌, ఇంటర్నెట్‌ సేవలకు ఆటంకం ఏర్పడింది. వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. దాదాపు 5లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక కోల్‌కతా అంతర్జాతీయ విమానాశ్రయం నీట మునగడంతో కార్గో విమానాల రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. 

గురువారం నుంచి సర్వీసులను పునరుద్ధరించారు. కాగా, ఆంఫన్‌ తుఫాన్‌ నేపథ్యంలో భారత్‌, బంగ్లాదేశ్‌లోని 1.9 కోట్ల మంది చిన్నారులు అంటువ్యాధులకు త్వరగా గురయ్యే ముప్పుందని యునిసెఫ్‌ ఆందోళన వ్యక్తం చేసింది. 

కాగా... ఈ తుఫాను బీభత్సం పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా స్పందించారు. తుఫాన్‌ తీవ్రత కరోనా మహమ్మారి కంటే దారుణంగా ఉందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. నష్టం ఎంత వాటిల్లిందో ఇప్పుడే చెప్పలేమన్నారు. తుఫాన్‌ మృతుల కుటుంబాలకు రూ.2- 2.5 లక్షల పరిహారాన్ని ఆమె ప్రకటించారు. మోదీ స్వయంగా వచ్చి ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని, రాష్ట్రానికి ఇతోధిక సాయం అందించాలని కోరారు. 

‘‘తుఫాన్‌ వల్ల సంభవించిన వినాశనాన్ని చూస్తున్నాం. ఈ కష్టకాలంలో దేశమంతా మీకు అండగా ఉంటుంది’’ అని మోదీ ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాలను ఆయన శుక్రవారం ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలిస్తారని ఉన్నతాధికారులు తెలిపారు.

ఇదిలా ఉండగా.. ఆంఫన్‌ ప్రభావం బంగ్లాదేశ్‌పైనా తీవ్రంగానే పడింది. పదిమంది వరకూ మృత్యువాత పడ్డారు. 20లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.