‘ఎండలు తగ్గించండి’’.. సీఎం ఆదేశం... అయోమయంలో అధికారులు

ఏపీలో కొందరు ఉన్నతాధికారులకు పెద్ద చిక్కొచ్చిపడింది. ఇంతకీ ఏమిటా చిక్కు అంటారా..? ఇప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎండలు( ఉష్షోగ్రత) తగ్గించాలి. ఎండలను తగ్గించడం ఏమిటా అనుకుంటున్నారా..? సీఎంగారు ఆదేశించారు మరి..అందుకే ఎలా తగ్గించాలా అంటూ తలలు బాదుకుంటున్నారు.

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో సోమవారం నీరు- ప్రగతి పథకంపై టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. నీరు - ప్రగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు ఎండలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉందన్న ఆయన ఉష్ణోగ్రతలు తగ్గించాలని అధికారులను ఆదేశించారు. మరీ ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గించాలని హుకుం జారీ చేశారు. అయితే చంద్రబాబు ఆదేశాలకు సదరు అధికారులు షాక్‌కు గురయ్యారు. ఎండలను తామెలా తగ్గించాలంటూ సీఎం వ్యాఖ్యలపై అధికారులు విస్మయం చెందారు.