ప్రధాని ఎవరి ట్రాప్ లో పడ్డారో తెలుసు: చంద్రబాబు

Chandrababu opposes PM Narendra Modi
Highlights

రోబోలు మనుషులకు ప్రత్యామ్నాయం కాదని, అందుకే జనాభాను పెంచాలని పిలుపునిస్తున్నానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర జనాభా తగ్గిపోతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

తిరుపతి: ప్రధాని నరేంద్ర మోడీ ఎవరి ట్రాప్ లో పడ్డారో అందరికీ తెలుసునని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కేసులు ఉన్నవాళ్లు రాష్ట్ర హక్కుల విషయంలో రాజీ పడుతున్నారని అన్నారు. ప్రత్యేక హోదాపై ప్రధాని మాట తప్పారని, గతంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని ఆయన విమర్శించారు. 

రోబోలు మనుషులకు ప్రత్యామ్నాయం కాదని, అందుకే జనాభాను పెంచాలని పిలుపునిస్తున్నానని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్ర జనాభా తగ్గిపోతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కొన్నాళ్లు గడిస్తే జనాభా తగ్గిపోతుందని, దాంతో యువత తగ్గిపోతుందని అన్నారు. 

ఎస్వీ యూనివర్శింటీ టాప్ టెన్ స్థాయికి ఎదగాలని ఆయన అభిలషించారు. ఉద్యోగాలు చేయడమే కాదు, ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని ఆయన అన్నారు. పాఠశాల స్థాయి నుంచే డిజిటల్ క్లాసులు నిర్వహిస్తున్నామని అన్నారు. 

తిరుపతిలోని ఎస్వీ యూనివర్శిటీలో జరిగిన జ్ఞానభేరి కార్యక్రమంలో చంద్రబాబు శనివారం విద్యార్థులతో మాట్లాడారు. ఈ యూనివర్సిటీలోనే చదువుకుని అసెంబ్లీకి వెళ్లానని, వెంకటేశ్వరస్వామిసన్నిధిలో జ్ఞనభేరి ప్రారంభిస్తున్నామని ఆయన చెప్పారు. 

రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో పెట్టాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ప్రపంచంలోనే ఎక్కువ మంది ఇంగ్లీష్ మాట్లాడే దేశం భారత్ అని, ఐటీ వల్ల ప్రపంచం గ్లోబల్ విలేజ్‌గా మారిందని ఆయన అన్నారు. 
 
 2022నాటికి రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలుపుతామని చెప్పారు. సెల్‌ఫోన్‌తోనే అన్ని ప్రభుత్వ సేవలు పొందే రోజులు రాబోతున్నాయని చెప్పారు.

loader